పెళ్లై ఆరునెలలు కూడా గడవకముందే ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్గొండజిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కలిచి వేస్తోంది.  

నల్గొండ : ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆ నవదంపతులు. కొత్త కాపురాన్ని ఎంతో ఉత్సాహంగా గడపాల్సిన వారి పాలిట ఆర్థిక ఇబ్బందులు పెను శాపంగా మారాయి. దీంతో ఆరు నెలల్లోనే వారి వైవాహిక బంధం ముగిసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఆ నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తెలంగాణాలోని నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం పడమటితండాలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పడమటితండాలో గుడి పూజారి గా పనిచేసే రమావత్ బాలోజీ మొదటి భార్య కుమారుడు లక్షణ్ (24)కు నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లికి చెందిన పాల్తి సురేందర్, బామ్నిల కుమార్తె నికిత(20)తో ఆరు నెలల క్రితం వివాహమయ్యింది. మొదటి భార్య చనిపోవడంతో పన్నెండేళ్ల క్రితం బాలోజీ రెండో వివాహం చేసుకున్నారు. లక్ష్మణ్.. గ్రామంలో కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో లక్ష్మణ్, నికిత కొద్దిరోజులుగా దిగులుగా ఉంటున్నారు. 

నాన్నను అమ్మ, మరోవ్యక్తి కలిసి చంపేశారు.. మూడున్నరేళ్ల చిన్నారి వాంగ్మూలం..ఇద్దరి అరెస్ట్..

ఈ క్రమంలో మంగళవారం లక్ష్మణ్ బంగారు ఆభరణాల రుణం కోసం కొండమల్లేపల్లికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి నిఖిత ఉరివేసుకుని కనిపించడంతో.. లక్ష్మణ్ సైతం ఉరేసుకున్నట్లు తెలుస్తోంది అని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న నికిత బంధువులు గ్రామానికి చేరుకుని.. ఆత్మహత్యలపై అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆందోళనకు దిగారు. గుడిపల్లి ఎస్ఐ పి వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దీనికి సంబంధించి ఇంకా ఫిర్యాదు అందలేదని, కేసు దర్యాప్తు జరిపి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.