ప్రియుడితో కలిసి.. భర్త శవంతో 50.కిమీ.లు ప్రయాణించి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది ఓ భార్య. అయితే, మూడున్నరేళ్ల కూతురి వాంగ్మూలంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. 

భువనగిరి : ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో హత్య చేసింది ఓ ఇల్లాలు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పెద్ద పథకాన్ని రచించింది. చేతిలో మూడున్నరేళ్ల బాలిక.. మధ్యలో భర్త మృతదేహం.. టూవీలర్ నడుపుతున్న ప్రియుడు.. ఇలా శవంతో 50 కిలోమీటర్లు ప్రయాణించారు. వంతెనపై నుంచి బైక్ తో సహా మృతదేహాన్ని కిందకి తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. మాటలు సరిగ్గారాని చిన్నారి.. గిరిజన భాషలో ఇచ్చిన వాంగ్మూలం ఈ హత్యోదంతాన్ని వెలుగులోకి తెచ్చింది. భువనగిరి మండలం అనంతారం సమీపంలో ఈనెల 18న జాతీయ రహదారి వంతెనపై నుంచి కింద పడి మృతి చెందిన లకావత్ కొమురెల్లి(32)ది హత్యగా పోలీసులు తేల్చారు. 

నిందితులైన కొమ్రెల్లి భార్య భారతి అలియాస్ సుజాత, ఆమె ప్రియుడు భానోత్ ప్రవీణ్ ను హైదరాబాదులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారని డీసీపీ తెలిపారు. భువనగిరిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వెంకట్ రెడ్డి తో కలిసి ఆయన వివరాలు తెలిపారు.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హనుమంతపురం గ్రామ పరిధిలోని తీటుకుంటతండాకు చెందిన లకావత్ కొమ్రెల్లి, భారతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఆరేళ్ల క్రితం వీరు సికింద్రాబాద్ వచ్చి నామాలగుండులో జిహెచ్ఎంసి పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు.

చాక్లెట్ ఆశచూపి మైనర్ బాలికపై అత్యాచారం.. కామాంధుడికి 20 ఏళ్ల జైలు, ఆదిలాబాద్ కోర్ట్ సంచలన తీర్పు

వీరికి ముగ్గురు కుమార్తెలు.ఇద్దరు బిడ్డలను జనగామలోని ఎస్టి వసతి గృహంలో చేర్పించారు. చిన్న కుమార్తెతో కలిసి నామాలగుండులో ఉంటున్నారు. రెండేళ్ల క్రితం బంధువుల వివాహ వేడుకల్లో జనగామ జిల్లా అడవి కేశవపురానికి చెందిన డీజే ఆపరేటర్ బానోతు ప్రవీణ్ పరిచయమయ్యాడు. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనుమానం వచ్చిన భర్త భారతిని నిలదీశాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భారతి నిర్ణయించుకుంది. మరోపక్క భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలి అనుకున్న కొమురెల్లి ఈనెల 18న సొంత ఊరు వెళ్తున్నా అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.

భర్త లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి రప్పించింది భారతి. కొమురెల్లి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చాడు. తన భార్య ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడవ పడుతుండగా భారతి, ఆమె ప్రియుడు ప్రవీణ్ కలిసి కొమ్రెల్లిని చున్నీతో కలిసి ఉరేసి ఇంట్లోనే అంతమొందించారు. ఈ శవాన్ని తీసుకుని భువనగిరి మండలం అనంతారం సమీపంలోకి తీసుకువెళ్లి ద్విచక్ర వాహనంతో సహా కొమ్రెల్లి మృతదేహాన్ని వంతెనపై నుంచి కిందికి తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఇది హత్య అని అనుమానం రావడంతో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. హత్య సమయంలో భారతి దగ్గర ఉన్న మూడున్నరేళ్ల చిన్నారిని విచారించారు. ఇంట్లో గొడవ జరిగిందంటూ, అమ్మ మరో వ్యక్తి కలిసి తన తండ్రిని చంపారు అంటూ ఆ పాప చెప్పిందని డీసీపీ తెలిపారు. నిందితులు బానోతు ప్రవీణ్, లకావత్ భారతిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.