పెళ్ళయిన పన్నెండు రోజుల్లోనే... కరోనాతో యువకుడు మృతి
పెళ్లయిన పన్నెండు రోజులకే ఓ యువకున్ని కరోనా కబళించివేసిన దారుణం జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల: పెళ్లయి కనీసం పదిహేనురోజులు కూడా పూర్తవకముందే ఓ యువకుడిని కరోనా కబళించివేసింది. దీంతో ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన అతడి భార్య ఒంటరయ్యింది. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట చింతకుంట కృష్ణంరాజు(26)కు ఇటీవలే వివాహమయ్యింది. ఈ నెల(మే)13న వివాహం చేసుకున్న ఇతడు ఆ తర్వాత కరోనాబారిన పడ్డాడు. దీంతో ఐసోలేషన్ లో వుండి చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం తాజాగా పూర్తిగా క్షీణించడంతో మృత్యువాతపడ్డాడు.
భర్త మరణ వార్త తెలిసి నవవధువు కన్నీరుమున్నీరవుతోంది. ఆమెను ఆపడం ఎవరితరం కావడం లేదు. కృష్ణంరాజు కుటుంబసభ్యులు కూడా బోరున విలపిస్తున్నారు. పదిరోజుల క్రితమే పెళ్లిబాజాలు మోగిన ఇంట్లో కరోనా మహమ్మారి చావు బాజ మోగించింది.
read more 10 రోజుల తర్వాత తెలంగాణలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్: రెండో డోసు వారికే
ఇలాంటి విషాద సంఘటనే ఇటీవలే విశాఖపట్నంలో చోటుచేసుకుంది. జిల్లాలోని చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ కు రోలుగుంట మండలం ఆర్ల గ్రామానికి చెందిన మేనమామ కూతురితో వివాహం నిశ్చయమయ్యింది. మరో మూడురోజుల్లో అంటూ ఈనెల 26వ తేదీన వీరి వివాహం జరగాల్సి వుంది. పెళ్ళికి అంతా సిద్దం చేసుకున్నారు.
ఇంతలోనే దారుణం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు రజనీకాంత్ కు జ్వరం రావడంతో నర్సీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అక్కడ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో అక్కడే చికిత్స పొందుతున్న అతడి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ అతడు మరణించాడు.
ఇలా మరికొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు పాడె ఎక్కడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సరైన సమయంలో వైద్యం అందించివుంటే తన బావ బ్రతికేవాడని పెళ్లి కుమార్తె బోరున విలపించింది.