Asianet News TeluguAsianet News Telugu

నా అన్నతో పంచనామాపై బలవంతంగా సంతకం పెట్టించారు.. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు...

కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లల్లో జరుగుతున్న సోదాల్లో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డి పెద్ద కొడుకు మహేందర్ రెడ్డితో పంచనామా మీద బలవంతంగా సంతకం పెట్టించారంటూ కేసు నమోదయ్యింది. 

My brother were forced to sign the panchanama, Bhadra Reddy's complaint against the IT officials, hyderabad
Author
First Published Nov 25, 2022, 7:20 AM IST

హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన  ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సి.ఎం.డి రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్ రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.

నా అన్నను బెదిరించారు…
మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, బుధవారం రాత్రితో మహేందర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండెనొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ.. మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి  బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లాకర్ల తాళాలను తీసుకెళ్లిన ఐటీ అధికారులు... డొనేషన్లపైనే అనుమానాలు, సోమవారం మల్లారెడ్డికి పిలుపు

దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్ పై ఐపీసీ లోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ. 100 కోట్ల డొనేషన్ లకు సంబంధించిన పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్ రెడ్డి  సంతకాలు తీసుకున్నట్లు సమాచారం. కాగా,  తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. 

లాప్టాప్, హార్డ్ డ్రైవ్ ఉన్న బ్యాగులు దొంగిలించారు…
ఇదిలా ఉండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడికి తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు.. బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్టాప్, హార్డ్ డ్రైవ్స్ తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్  34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆసుపత్రి దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు.

ఠాణా గేటు వద్ద  ల్యాప్టాప్..!
ఈ రెండు కేసులు నమోదైన కొద్ది సేపటికి ఓ ల్యాప్ టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది.  రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్టాప్ సహ ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ  నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో ఓ ల్యాప్ టాప్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ గేట్ వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్ కు చూపించారు. అయితే, లాప్టాప్ తనది కాదని, ఎవరో మార్చేశారని  అన్నారు. దీంతో దాన్ని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు.

Follow Us:
Download App:
  • android
  • ios