తనను అవినీతిపరుడు, అక్రమార్కుడు అన్నరీతిలో వ్యాఖ్యలు చేసిన జనగామ కలెక్టర్ దేవసేనపై ముప్పేట దాడికి దిగారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ముత్తిరెడ్డి చెరువు భూములు, దేవాలయ భూములు కబ్జా చేశారంటూ జనగామ కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. దీంతో ముత్తిరెడ్డి సైతం రంగంలోకి దిగి కలెక్టర్ మీద ముప్పేట దాడి షురూ చేశారు.

నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్ కు మూడు పేజీల ఫిర్యాదును అందజేశారు. సచివాలయానికి వచ్చిన ముత్తిరెడ్డి సిఎస్ కు ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను పబ్లిక్ గా అవమానపరిచారని ఆమె మీద సిఎం కేసిఆర్ కు కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. అయితే సిఎం ఆమె మీద బాజాప్తా యాక్షన్ తీసుకుంటడన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

మరోవైపు తనపై బహిరంగ ప్రటకనలు చేసి తన హక్కులు కాలరాశారని అందుకే కలెక్టర్ దేవసేనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ మధుసూదనాచారికి కూడా ఫిర్యాదు చేశారు ముత్తిరెడ్డి. కలెక్టర్ మీద సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చేసిన ఆరోపణల మీద స్పీకర్ కు సవివరమైన లేఖను అందజేశారు. తన మీద వచ్చిన ఆరోపణల్లో రుజువులు ఉంటే ఏ చర్యలు తీసుకున్నా సిద్ధమేనని, లేకపోతే కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు.

ఇక ఈరెండు వైపులా ఫిర్యాదులు చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని చెబుతున్నారు. కచ్చితంగా సిఎం కేసిఆర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు చెబుతున్నారు. ఒక ఉన్నత స్థాయి అధికారి అయి ఉండి తనమీద పబ్లిక్ గా ఎందుకు ఆరోపణలు, విమర్శలు చేయాల్సివచ్చిందని ముత్తిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇలా తనమీద ఆరోపణలు చేయడంతో తన పరువు ప్రతిష్టలకు భంగం కలగదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతపై ఇలా బహిరంగ కామెంట్స్ చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే కలెక్టర్ పై న్యాయపోరాటం చేసే విషయమై కూడా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరి సిఎం వద్దకు వెళ్లిన తర్వాత ఈ పంచాయతీ ఎటు దారి తీస్తుందా అన్న ఉత్కంఠ టిఆర్ఎస్ వర్గాల్లోనే కాక అన్ని రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/DxYmYB