మునుగోడు బైపోల్ 2022 : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థల నామినేషన్లు నేడు...
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మునుగోడు ఎన్నిక కోసం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నేడు మొదటి సెట్ నామినేషన్లు వేయనున్నారు.
హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికలో హీట్ పెరిగింది సోమవారం మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్ హాజరవుతారు. బంగారుగడ్డ నుంచి చండూరు తహసిల్దార్ కార్యాలయం వరకు బీజేపీ ర్యాలీగా రానుంది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు మంత్రులు హాజరుకానున్నారు.
చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయంలో ప్రభాకర్ రెడ్డి పూజలు నిర్వహించి బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇవాళ రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మళ్ళీ 14న రెండోసారి రెండు సెట్ల నామినేషన్లు వేయనున్నారు.
మునుగోడులో 3.95 లక్షల మందికి లేఖలు రాయనున్న సీఎం కేసీఆర్.. ఎందుకంటే ?
బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చుకున్న టీఆర్ఎస్ కు మునుగోడు ఉప ఎన్నిక పరీక్షగా మారుతుందని అందరూ ఊహించారు. టిఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారా? లేక బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికలకు పోతారా? అన్న సందిగ్ధంలో క్యాడర్ ఉందని ఊహాగానాలు చెలరేగాయి. తెలంగాణ సెంటిమెంట్ పదం లేకుండా.. బీఆర్ఎస్ పేరుతో నామినేషన్ వేస్తే ఎలా అనే విమర్శలూ వచ్చాయి.
దీనిమీద ఎంపీ వినోద్ స్పష్టతనిచ్చారు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పేరుతోనే పోటీకి వెడుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు మునుగోడు ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పకడ్బందీ వ్యూహం అమలు చేస్తోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించింది. ప్రతి యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. 14 మంది మంత్రులు, ముగ్గురు ఎంపీలు, 54 మంది ఎమ్మెల్యేలను ఇన్చార్జిగా నియమించింది. ఏడుగురు ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్ లకు పూర్తి బాధ్యత అప్పగించింది.
ప్రతి ఎంపీటీసీ పరిధికి ఒక ఎమ్మెల్యే, మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ఒక్కో ఎమ్మెల్యేకు 800 నుంచి 1200 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రులకు అత్యధికంగా మూడువేల ఓటర్ల బాధ్యతలు అప్పగించారు. ప్రచారం చివరి రోజు వరకు నియోజకవర్గంలోనే ఉండాలని కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని బిఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రెండు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలు చర్చించారు. ఈ ఏడాది నవంబర్ 3వ తేదీ తేదీన మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరణ ప్రారంభం అయ్యింది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థిని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని బీఆర్ఎస్ ప్రకటించింది.