సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్పందించారు. మోదీ సభకు కేసీఆర్ దూరంగా ఉండటాన్ని ఎంపీ కోమటిరెడ్డి తప్పుబట్టారు.

హైదరాబాద్‌: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మోదీ సభకు కేసీఆర్ దూరంగా ఉండటాన్ని ఎంపీ కోమటిరెడ్డి తప్పుబట్టారు. ప్రధాని మోదీని కలవకుండా సీఎం కేసీఆర్ తప్పు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు కదా అని అన్నారు. తాను పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి నిధులు తెచ్చుకున్నానని తెలిపారు. 

ఎన్ని కోట్లాటలు, విభేదాలు ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రానికి ఏం కావాలో సాధించుకోవాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌‌లు.. వారి వారి రాష్ట్రాలకు మోదీ వచ్చినప్పుడు స్వాగతం పలకడం లేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్తే ఎవరూ పట్టించుకుంటారని ప్రశ్నించారు. 

మోదీ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం ఇచ్చారని.. ఆ సమయంలో రాష్ట్రానికి కావాల్సిన 70 సమస్యలు ప్రస్తావించవచ్చని అన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఆయన కొట్టినట్టుగా.. ఈయన తిట్టినట్టుగా యాక్ట్ చేస్తున్నారని అనిపిస్తుందని విమర్శించారు.