Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ మెసేజ్ కు స్పందించిన కవిత, ఖతార్ నుంచి విముక్తి

ఖతార్ లో చిక్కుకుని స్వగ్రామానికి చేరిన నిజామాబాద్ జిల్లా గన్నారం వాసి

బాధితుడి వాట్సాప్ మెసేజ్ తో స్పందించిన నిజామాబాద్ ఎంపీ కవిత.

మృత్యుముఖం నుండి ఎట్టకేలకు  తల్లిదండ్రులను, భార్యను చేరిన యెర్రా సాగర్. 

MP Kavita rescues Telangana worker stuck in Qatar

ఖతార్ లో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లా యువకుడు నిజామాబాద్  ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి సహాయంతో స్వగ్రామం చేరాడు. ఖతార్ లో ఉండగా బాధితుడు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి వాట్సప్ లో చేసిన మెసేజ్ తో ఆ యువకుడి విముక్తికి మార్గం సుగమమైంది. చంపుతానని బెదిరించిన కఫిల్ బారి నుండి ఇపుడు స్వగ్రామం చేరాడు. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన యెర్రా సాగర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017 జనవరిలో సాగర్ డ్రైవర్ గా ఖతర్ వెళ్లాడు. అక్కడికి వెళ్ళాక మూడు నెలల తర్వాత కూడా కఫిల్ (యజమాని) జీతం ఇవ్వలేదు. అడిగితే సాగర్ ను తీవ్రంగా  కొట్టాడు. తర్వాత చంపుతానని ఎడారిలోకి తీసుకెళ్లి బెదిరించాడు. కేవలం భోజనం పెడతామని, తిని పనిచేయాలని, జీతం అడగొద్దు అని చెప్పాడు. సాగర్ ను అక్కడి పోలీసుస్టేషన్ తీసుకెళ్లి కేసు పెట్టారు. 

 

బయటికి వచ్చిన సాగర్ ఈ కష్టాల నుండి తనను రక్షించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి వాట్సప్ లో మెసేజ్ చేసాడు. స్పందించిన ఎంపీ కవిత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. కాగా ఎంపీ కార్యాలయ సిబ్బంది గన్నారం లోని బాధితుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.  అప్పటికే  మరోసారి అరెస్ట్ అయ్యి నెల రోజులు జైల్లో ఉన్న సాగర్ ను ఎంపి కవిత వినతితో ఎంబసీ అధికారులు  విడిపించారు. అప్పటికే సాగర్ పాస్ పోర్ట్ యజమాని లాక్కోవడంతో ఎంబసీ అధికారులు తాత్కాలిక ఔట్ పాస్ ఇచ్చారు. ఎట్టకేలకు సాగర్ ను మూడురోజుల క్రితం భారత్ కు పంపి ఎంపీ కవితకు సమాచారమందించారు. తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి స్వదేశం చేరిన సాగర్ ను మీడియాకు పరిచయం చేయగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు సాగర్. తనను స్వదేశానికి తీసుకువచ్చిన ఎంపీ కవిత గారికి తాను, తన కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని అన్నారు. ఎర్రా సాగర్ విషయంలో సహకరించిన ఎంబసీ అధికారి ఫణీశ్రీ గారికి నవీన్ ఆచారి కృతఙ్ఞతలు తెలిపారు. 

 

ప్రెస్ మీట్ లో జాగృతి జిల్లా కన్వినర్ అవంతీ కుమార్, మహిళా విభాగం కన్వీనర్ అపర్ణ, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ పులి జైపాల్, జిల్లా జాగృతి కోకన్వీనర్ విజయ్ కుమార్ జాగృతి నాయకులు హరీష్, కొట్టుర్ నర్సింలు, రాజేశ్వర్, శ్రీనివాస బాలు, శివానంద్, సందీప్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios