రేపటి నుంచి తెలంగాణలో సినిమా థియేటర్లు పూర్తిగా బంద్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర థియేటర్స్ అసోసియేషన్ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది. ప్రేక్షకుల ఆరోగ్యం, కరోనా దృష్ట్యా రేపటి నుంచి తెలంగాణలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీతో ప్రదర్శనలకు అనుమతినిచ్చింది. 

అటు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతే తప్ప సినిమా షూటింగ్‌లు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మంగళవారం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.   

అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ వెల్లడించారు. 

Also Read:కరోనా ఎఫెక్ట్: నేటి నుండి తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, వీటికి మినహాయింపు

కాగా, తెలంగాణ రాష్ట్రంలో  రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నెల 20 వ తేదీ నుండి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

నైట్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్స్, మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మాసూటికల్స్, నిత్యావసర సరుకులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.