హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  సెప్టెంబర్ 27వ తేదీన  ఆలేరులో సభను నిర్వహించనున్నారు. ఈ సభలోనే తన భవిష్యత్ కార్యాచరణను నర్సింహులు వెల్లడించే అవకాశం ఉంది.

త్వరలోనే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ స్థానం నుండి నర్సింహులు స్వతంత్ర అభ్యర్థిగా  పోటీ చేయనున్నారు. ఈ మేరకు  సెప్టెంబర్ 27వ తేదీన మోత్కుపల్లి శంఖారావం పేరుతో భారీ బహిరంగసభను ఏర్పాటు చేయాలని  మోత్కుపల్లి నర్సింహులు నిర్ణయం తీసుకొన్నారు.

ఈ ఏడాది మే 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన  మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై పార్టీ వేటు వేసింది. పార్టీ వేటు వేయడంతో టీడీపీపై, చంద్రబాబుపై  మోత్కుపల్లి  నర్సింహులు  తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తిరుపతికి వెళ్లి చంద్రబాబునాయుడు ఓడిపోవాలని కూడ మోత్కుపల్లి నర్సింహులు  బాలాజీని కోరుకొన్నారు. బాబుపై విమర్శలను మోత్కుపల్లి తీవ్రం చేసిన సమయంలోనే  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడ సమావేశమయ్యారు.

అయితే  మోత్కుపల్లి నర్సింహులు జనసేనలో చేరుతారనే  ప్రచారం కూడ సాగింది. కానీ,  జనసేనలో  నర్సింహులు  చేరలేదు. ఒకానొక దశలో టీఆర్ఎస్ లో కూడ నర్సింహులు  చేరే అవకాశం ఉందని ప్రచారం కూడ సాగింది. కానీ, టీఆర్ఎస్‌లో కూడ నర్సింహులుకు అవకాశం దక్కలేదు.

ఈ తరుణంలోనే స్వతంత్ర అభ్యర్థిగా  ఆలేరు బరిలో నుండి దిగాలని  నర్సింహులు భావిస్తున్నారు. 2009, 2014 మినహా 1983 నుండి ఆలేరు నుండి నర్సింహులు పలు దఫాలు పోటీచేశారు. టీడీపీ, కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈ దఫా మాత్రం  మరోసారి నర్సింహులు  స్వతంత్ర అభ్యర్థిగా  పోటీ చేయనున్నారు. 

ఆలేరు నుండి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొనేందుకు వీలుగా  సెప్టెంబర్ 27వ తేదీన నర్సింహులు  మోత్కుపల్లి శంఖారావం పేరుతో సభను నిర్వహించనున్నారు. ఈ సభ వేదికగా తన భవిష్యత్ కార్యాచరణను  నర్సింహులు వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే  టీడీపీ నుండి బహిష్కరణకు గురైన తర్వాత తనకు ఏ పార్టీ నుండి ఆహ్వానం అందలేదని నర్సింహులు చెప్పారు. దళితుడినైందునే తనను కేసీఆర్ పక్కకు పెట్టి ఉంటారనే అనుమానాన్ని నర్సింహులు వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

ఈ ఎన్నికలే నాకు చివరివి: మోత్కుపల్లి

ముందస్తు ఎన్నికలు.. మోత్కుపల్లి సంచలన ప్రకటన
హరికృష్ణ మృతి: కన్నీళ్లు పెట్టుకొన్న మోత్కుపల్లి

మోత్కుపల్లికి చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ షాక్: ఎందుకు?