తెలంగాణ ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. కేసీఆర్ గురువారం తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయడం.. ఆ తర్వాత వెంటనే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం వేగవంతంగా జరిగిపోయింది. టికెట్ పొందినవారంతా ప్రచారం ఎప్పటి నుంచి ప్రారంభించాలా అని ప్లాన్లు వేస్తుంటే.. టికెట్ లభించని వారు నిరుత్సాహానికి గురయ్యారు.

ఇదిలా ఉంటే.. టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలేరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. 

గురువారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 35ఏళ్లుగా ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆలేరు ప్రజలు తనను దీవించి శాసనసభకు పంపితే గోదావరి జలాలను సాధించి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 17న యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గంస్థాయి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశానని, విషయాలు చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు.