ఉయ్యాలలో పడుకోబెట్టిన పసికందుపై కోతుల దాడి.. బొటనవేలు కొరికేసి బీభత్సం..
తెలంగాణలోని మహబూబాబాద్ లో కోతులు ఓ నెలన్నర రోజుల చిన్నారిమీద దాడి చేశాయి. ఆ చిన్నారి కాలి బొటనవేలు కొరికేశాయి.
మహబూబాబాద్ : చిన్నారులపై జంతువుల దాడులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. హైదరాబాదులో నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో వీధి కుక్కల విషయంలో నగరపాలక సంస్థలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. ఒకవైపు ఇలా జరుగుతుంటే మరోవైపు.. కోతులు కూడా చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో వెలుగు చూసింది.
ఉయ్యాలలో పడుకున్న ఓ చిన్నారి కాలి బొటనవేలును కోతులు కొరికాయి. ఈ హృదయ విధారకమైన ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. మోదుగుల గూడెంలోని ఓ ఇంట్లో చిన్నారిని ఊయలలో పడుకోబెట్టారు. ఆ చిన్నారిపై కోతులు దాడి చేశాయి. దీంతో చిన్నారి కాలి బొటనవేలు గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులు మరిపెడ మండలం వీరారం గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ చిన్నారి ఉంది. ఆ చిన్నారి వయసు నెలన్నర రోజులు.
అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో చిన్నారి మృతి : హైకోర్ట్ సీరియస్.. రేపు విచారణ
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చిన్నారిని ఇంటి ఆవరణలోని ఉయ్యాలలో పడుకోబెట్టారు. నీళ్ల కోసం తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఈ సమయంలో ఓ కోతుల గుంపు ఒక్కసారిగా వచ్చి ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై పడ్డాయి. ఈ దాడికి బిత్తర పోయిన ఆ చిన్నారి ఒక్కసారిగా పెద్ద పెట్టిన ఏడవడం మొదలుపెట్టింది. పాప కేకలు విన్న తల్లి లావణ్య పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి కోతులు చిన్నారిపై కనిపించాయి. వెంటనే ఓ కర్రతో కోతులను తరిమికొట్టింది. ఆ కాసేపట్లోనే కోతులు చిన్నారి బొటనవేలును కొరికేశాయి. సమాచారాన్ని భర్తకు, కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే వారంతా కలిసి చిన్నారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నిరుడు సెప్టెంబర్ లో సూర్యాపేటలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, పాత సూర్యాపేట గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిపై కోతిమూక దాడికి దిగడంతో ఆమె మరణించింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… మెట్టు లింగమ్మ అనే మహిళకు రెండు నెలల క్రితం పక్షవాతం సోకింది. దీంతో ఆమె కదలలేని స్థితికి చేరుకుంది. ఆమె కోసం కొడుకు శంకర్ రెడ్డి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశాడు.
శంకర్ రెడ్డి దంపతులు పొలం పనులకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న లింగమ్మ మీద అటుగా వచ్చిన కోతులు దాడి చేశాయి. ఆమె ముఖం, నడుము, కాళ్లను ఇష్టారాజ్యంగా కరిచాయి. వీరి ఇల్లు వీధి చివరన ఉంది. దీంతో గ్రామస్తులు కోతుల దాడిని గమనించలేకపోయారు. పక్షవాతంతో అచేతనంగా ఉన్న వృద్ధురాలు కోతుల దాడితో తీవ్ర గాయాలపాలై.. మంచం మీదనే ప్రాణాలు విడిచింది.
ఇది జరిగిన చాలాసేపటికి.. వీరి ఇంటికి రోజూ తాగునీరు తీసుకెళ్లేందుకు వచ్చే ఎస్సీ కాలనీ వాసులు వచ్చారు. నీరు పట్టుకునేందుకు వారు ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా, గాయాలపాలై అచేతనంగా ఉన్న లింగమ్మ కనిపించింది. వారు వెంటనే శంకర్ రెడ్డికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చిన శంకర్ రెడ్డి వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఆమె అప్పటికే మరణించినట్లు తెలిసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.