అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో చిన్నారి మృతి : హైకోర్ట్ సీరియస్.. రేపు విచారణ
అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై తెలంగాణ హైకోర్ట్ రేపు విచారణ జరపనుంది.
అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో చిన్నారి మరణించిన ఘటనపై తెలంగాణ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం .. రేపు విచారించనుంది. వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరించింది కోర్ట్.
కుక్కల దాడిలో బాలుడు మృతి..
అంబర్ పేట ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ప్రదీప్ అనే బాలుడు ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నగంగాధర్ కుమారుడు. గంగాధర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఇంధల్వాయి వారి స్వస్థలం. అయితే, ఉపాధి నిమిత్తం హైద్రాబాద్ కు వచ్చారు. ఈ అంబర్ పేటలో నివాసం ఉంటూ.. కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. గంగాధర్ కు ఇద్దరు పిల్లలు. ఆరేళ్ల వయస్సున్న కూతురు, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. ఆదివారం నాడు ఇద్దరు పిల్లలను తాను పనిచేసే కారు సర్వీసింగ్ సెంటర్ వద్దకు వచ్చారు. అయితే, ఆడుకుంటూ ప్రదీప్ తన సోదరి వద్దకు వెళ్లే సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి.
దాడి జరిగిన తర్వాత కొందరు స్థానికులు హుటాహుటిన ప్రదీప్ ను రక్షించి గంగాధర్ తో కలిసి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రదీప్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. "మా మున్సిపాలిటీల్లో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. యానిమల్ కేర్ సెంటర్లు, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా వంతు కృషి చేస్తాం" అని కేటీఆర్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
Also REad: కుక్కల దాడిలో చిన్నారి బలి.. అంబర్‌పేట్‌లో పోలీసుల విచారణ, కార్ల షోరూమ్ ప్రతినిధులపై కేసు
మరోవైపు.. అంబర్‌పేట్ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఆరోజు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్ కమీషనర్లు, అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ఆకలితోనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయని వ్యాఖ్యానించారు. కుక్కలు ఎక్కువగా వున్న ప్రాంతాలపై దృష్టి పెడతామని మేయర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 4 లక్షలకు పైగా కుక్కలను స్టెరిలైజ్ చేశామని విజయలక్ష్మీ వెల్లడించారు.
అంతకుముందు అంబర్‌పేట్ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్యపై 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని ఆయన అన్నారు. దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో చర్చిస్తామని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.