బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సోమవారం 72 గంటల నిరాహార దీక్షకు దిగారు.
KNOW
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఈ నిరాహార దీక్ష ఆగస్టు 4 నుంచి 6 వరకు ధర్నాచౌక్ వద్ద జరగనుంది. దీని ద్వారా బీసీ సమాజానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశం ఉందని ఆమె తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం
తెలంగాణ రాష్ట్రంలో బీసీలు సమాజంలో సగానికి పైగా ఉన్నా వారికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం దక్కలేదని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి 42 శాతం రిజర్వేషన్లు అవసరమని డిమాండ్ చేశారు. ఈ లక్ష్యంతోనే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.
చరిత్రలో నిలిచే పోరాటమని కవిత వ్యాఖ్య
ధర్నా చౌక్‌లో బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించిన కవిత, ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీసీలకు రాజ్యాధికారంలో వాటా రావాలని, ఆర్థిక అవకాశాలు పెరగాలని తమ సంకల్పం అని ఆమె వివరించారు.
రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లులు
2025 మార్చి 17న తెలంగాణ అసెంబ్లీలో రెండు ముఖ్యమైన బిల్లులు ఆమోదించిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ బిల్లు, 2025. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల రిజర్వేషన్ బిల్లు, 2025. ఈ బిల్లుల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యం. అయితే ఇవి ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత విమర్శ
కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంలో చిత్తశుద్ధి చూపలేదని విమర్శించారు. భాజపాపై నెపం వేసి సమస్య నుంచి తప్పించుకోవద్దని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్‌పై వేరు బిల్లు పెట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
