ఎమ్మెల్సీ కవితకు కోర్టులో నిరాశ.. 23వ తేదీ వరకు రిమాండ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టు అయిన బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టు రిమాండ్ విధించింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీకి అప్పగించింది.
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమెను శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ అధికారుల వాదలను విన్న ధర్మాసనం.. కవితను 23వ తేదీ వరకు కస్టడీకి అప్పగించింది. అయితే ఆమెను 10 రోజుల వరకు కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరగా.. దానిని కోర్టు నిరాకరించింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య నిర్ణయం.. బీఎస్పీకి రాజీనామా
కేవలం 7 రోజుల కస్టడీకి అప్పగించి.. మార్చి 23వ తేదీన కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు హైబీపీ ఉందని ఆమె లాయర్ కోర్టుకు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత స్థాయిలో బీపీ పెరగలేదని వెల్లడించారు. ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కస్టడీ నుంచి ఉపశమనం ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ దానిని కూడా కోర్టు నిరాకరించింది. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ఆమెకు ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మెడిసిన్ అందించవచ్చని లాయర్ కు కోర్టు సూచించింది.
కాగా.. కవిత కోరిన కొన్ని మినహాయింపులకు కూడా కోర్టు అంగీకారం తెలిపింది. ప్రతీ రోజూ ఫ్యామిలీ మెంబర్స్ ను, లాయర్స్ ను కలిసేందుకు అవకాశం ఇచ్చింది. అనంతరం ఆమెను ఈడీ తమ కార్యాలయానికి తీసుకెళ్లింది. కోర్టుకు వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనను అక్రమంగా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు.
7 దశల్లో లోక్ సభ ఎన్నికలు.. జూన్ 4న కౌంటింగ్.. ఏ రాష్ట్రంలో ఎప్పుడు పోలింగ్ అంటే...?
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రద్దు అయిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కింద అనవసరమైన ప్రయోజనాలకు బదులుగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులకు రూ .100 కోట్ల ముడుపులు చెల్లించిన 'సౌత్ గ్రూప్'లో కవిత ప్రమేయం ఉందని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ప్రముఖ ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ జైలులో ఉన్నారు.