MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్.. ‘ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి’

సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులు అందరినీ మేడిగడ్డ బ్యారేజీ వద్దకు తీసుకెళ్లుతానని సీఎం చెప్పారు. దీంతో అదేమైనా టూరిస్టు స్పాటా? అంటూ కవిత కామెంట్ చేశారు.
 

mlc kavitha counter to cm revanth reddy over promise of taking law makers to medigadda barrage kms

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఆమోదం లభించింది. శాసన సభలో, శాసన మండలిలోనూ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదం లభించింది. శాసన మండలిలో ఈ తీర్మానానికి ఆమోదం లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

గవర్నర్ స్పీచ్ అభ్యంతరకరంగా ఉన్నదని, ఆమె ప్రసంగంలో ఉపయోగించిన నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషణలు సమర్థనీయం కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ పదాలను రికార్డుల్లో నుంచి తొలగించాలని తాను సవరణ పెట్టానని వివరించారు. రెండు సార్లు ప్రజల తీర్పుతో అధికారాన్ని బీఆర్ఎస్ చేపట్టిందని, అలాంటి ప్రభుత్వాన్ని దూషణలు చేయడం సరికాదని ఆగ్రహించారు.

ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పునూ తాము గౌరవిస్తున్నామని కవిత అన్నారు. శాసన మండలిలో తమకు మెజార్టీ ఉన్నదని, కానీ, తమకు విజ్ఞప్తి చేయడంతో సవరణలను తాము వెనక్కి తీసుకున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని వివరించారు. గత ప్రభుత్వంపై విమర్శలకు పరిమితం కావడం కాదు.. రాష్ట్ర ప్రగతి కోసం వారి రోడ్ మ్యాప్‌ను ప్రజలకు వివరించాలి.

Also Read: Revanth Reddy: తెలంగాణ కోసం రాజీనామా చేసిన నళినికి సీఎం ఆఫర్.. ఆమె ఎలా స్పందించారంటే?

తాము ఎప్పటికీ ప్రజల పక్షమేనని కవిత అన్నారు. ఈ ప్రభుత్వం నష్టం జరిగే చర్యలు తీసుకుంటే మాత్రం కచ్చితంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.

శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ..  మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై సిట్టింగ్ జడ్జీలతో విచారణ చేపడతామని చెప్పారు. కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు కూడా వేస్తున్నట్టు వివరించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత సభ్యులందరినీ మేడిగడ్డ పర్యటనకు తీసుకెళ్లుతామని అన్నారు. 

ఈ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు అందరినీ తీసుకెళ్లడానికి అదేమైనా టూరిస్ట్ స్పాటా? అంటూ చురకలు అంటించారు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి తీసుకెళ్లితే తమకు అభ్యంతరాలేమీ లేవని వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios