Revanth Reddy: తెలంగాణ కోసం రాజీనామా చేసిన నళినికి సీఎం ఆఫర్.. ఆమె ఎలా స్పందించారంటే?
ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని గుర్తున్నదా? ఆమె తిరిగి అదే పదవిలో చేరడానికి సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారు. కానీ, ఆమె నిరాకరించారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కోసం సకల జనులు పాల్గొన్నారు. సబ్బండ వర్ణాలు కదం తొక్కాయి. రాజకీయ నేతలే కాదు.. ఉద్యోగులు కూడా రాజీనామాలు చేశారు. ఇలా ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిలో నళిని కూడా ఉన్నారు. 2009లో తెలంగాణ ఉద్యమ సమయంలో మెదక్ డీఎస్పీగా పని చేస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఓ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో రాజీనామాలు చేసి తిరిగి తమ కొలువుల్లో చేరారని, రాజకీయ నేతలు ఇతర పదవులను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటప్పుడు నళినికి ఎందుకు అన్యాయం జరగాలి? ఆమెకు ఇష్టమైతే ఆమె కూడా తిరిగి పోలీసు శాఖలో అదే ఉద్యోగంలో చేరవచ్చనే అవకాశాన్ని కల్పించారు. కానీ, నళిని ఈ ఆఫర్‌ను తిరస్కరించారు.
మాజీ డీఎస్పీ నళినిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ, ఓ న్యూస్ చానెల్‌తో ఫోన్‌లో మాట్లాడిన మాజీ డీఎస్పీ నళిని ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. రాజీనామా చేసి నేను రాజకీయ నేతల నుంచి తప్పించుకున్నాను. నా ఉద్యోగం తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు. కాబట్టి, దయచేసి తనను డిస్టర్బ్ చేయవద్దు అని ఆమె విజ్ఞప్తి చేశారు.
Also Read: Janasena: ఏపీలో ఓటు కోసం నాగబాబు దరఖాస్తు, వైసీపీ ఫైర్.. తెలంగాణలో ఓటేసి, ఏపీలో మరోసారి వేస్తారా?
ఎవరీ నళిని?
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఏపీపీఎస్ ద్వారా నియామకమయ్యారు. 2009 మార్చిలో హసన్‌పర్తి పోలీసు స్టేషన్‌లో పోస్టింగ్ వేశారు. హసన్‌పర్తి, వరంగల్ పోలీసు స్టేషన్‌లలో ఆరు నెలల ప్రొబేషన్ పూర్తి చేసి మెదక్‌కు డీఎస్పీగా వెళ్లారు. నల్గొండకు చెందిన నళిని 2005, 2006ల కాలంలో వరంగల్‌లోని పరకాలలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ కింద హాస్టల్ వార్డెన్‌గా చేశారు. ఆమె భర్త వరంగల్‌లో హైస్కూల్ టీచర్. వారికి ఇద్దరు పిల్లల సంతానం ఉన్నది.