తన అవినీతి అక్రమాలను బయటపెట్టడంతో జనగామ కలెక్టరమ్మ దేవసేనకు ఎదురు తిరిగాడు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. తనపై పబ్లిక్ గా కామెంట్స్ చేసి తన పరువు తీసిన కలెక్టర్ దేవసేనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ముత్తిరెడ్డి. ముత్తిరెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.

తెలంగాణ సచివాలయం లో సీఎస్ ఎస్.పి సింగ్ ని కలిసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి తనమీద కలెక్టర్ ఆరోపణలు చేయడంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపైన వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత నాపై ఉందన్నారు. 2000 గజాల స్థలం నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది అని జనగామ కలెక్టర్ అన్న మాట అవాస్తవం... అర్ధరహితమని కొట్టిపారేశారు. తన పేరు మీద ఒక్క గజం జాగా అయినా రిజిస్ట్రేషన్ అయి ఉంటే.... ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా అందుకు నేను సిద్ధం అని సవాల్ చేశారు ముత్తిరెడ్డి.

అది టెంపుల్ ట్రస్ట్ భూమి అయినప్పుడు దానికి చైర్మన్ గా ఎమ్మెల్యే ఉంటాడు కదా అని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ తనకు, కలెక్టర్ కి మధ్య ఫోన్ కాల్ విషయంలో చిన్న గందరగోళం ఏర్పడిందన్నారు. నాపై అనవసర ఆరోపణలు చేసిన కలెక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను, సీఎం ను కోరుతున్నానని వెల్లడించారు. ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యేపై కలెక్టర్ పబ్లిక్ గా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన నేపథ్యంలో ఆమెపై సిఎం బాజాప్తా చర్యలు తీసుకుంటాడని తాను నమ్ముతున్నట్లు స్పష్టం చేశారు.

జనగామలో మురికి కూపంగా... కంపు వాసనతో ఉన్న ధర్మన్నకుంట @ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి, గత 2 ఏళ్లుగా బతుకమ్మ ఉత్సవాలు జరిపిస్తున్నాని చెప్పుకొచ్చారు. బతుకమ్మ కుంట సుందరీకరణకు ప్రభుత్వం రూ. 1.75 కోట్లు కేటాయించిందన్నారు. బతుకమ్మకుంట డెవలప్మెంట్ విషయంలో నన్ను మంత్రులు హరీష్ రావు, ఈటల, జూపల్లి కూడా అభినందించారని గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ కూడా అక్కడ సభ నిర్వహించాల్సి ఉన్నా... కొన్ని అనివార్య కారణాల వలన జరపలేకపోయామని అన్నారు.

ముత్తిరెడ్డి ఏకంగా కలెక్టర్ పై ఫిర్యాదు చేయడంతో ఈ కేసు రసవత్తరంగా మారింది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/QU6DGN