వరంగల్ పర్యటనలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్లను తెలంగాణ మహిళలు కడగటం వివాదాస్పదంగా మారింది. ఇది మన సాంప్రదాయమని కాంగ్రెస్ అంటుంటే... తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని బిఆర్ఎస్ అంటోంది.

Miss World 2025 : తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ 2025 పోటీల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచ దేశాల నుండి వచ్చిన అందమైన అమ్మాయిలు విశ్వసుందరి పోటీల్లో పాల్గొనడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలను, పర్యాటక ప్రదేశాలను ప్రచారం చేయించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు దారితీస్తోంది. తాజాగా మిస్ వరల్డ్ పోటీదారుల వరంగల్ పర్యటన కూడా మరో వివాదానికి దారితీసింది. 

మిస్ ఇండియా కంటెస్టెంట్స్ అందరూ ప్రస్తుతం హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరిని తెలంగాణలోని చారిత్రాత్మక ప్రదేశాలను చూపించే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం... ఇందులో భాగంగానే నిన్న (బుధవారం) వరంగల్ లో పర్యటించారు. వీరికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. 

వరంగల్ లోని ప్రాచీన రామప్ప దేవాలయానికి చేరుకున్న మిస్ ఇండియా కంటెస్టెంట్స్ ని ముందుగా తెలంగాణ ఆడపడుచులు నీళ్లందించారు. ఓ ప్లేట్ లో పాదాలు పెట్టి ఆ నీటితో కాళ్ళు కడిగారు... ఆ తర్వాత టవల్ తో వారి పాదాలను తుడిచారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా విదేశీ మహిళల కాళ్లు కడిగిస్తారా? అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు. దీనిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ సీఎం పూర్తిగా మతితప్పాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. 

Scroll to load tweet…

మరో మాజీ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యారు. రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డల పరువు తీసింది... తెలంగాణ రాష్ట్రమే కాదు భారత దేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇది అంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. 

అయితే ప్రభుత్వం, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం మిస్ట్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ కాళ్లను తెలంగాణ ఆడపడుచులు కడగడం సాంప్రదాయంగా పేర్కొంటున్నారు. మన ఇంట ఏ శుభకార్యం జరిగినా మహిళలు కాళ్లుకడిగి పసుపు పెట్టడం సాంప్రదాయం... దీన్నే రేవంత్ సర్కార్ చేసిందంటున్నారు. మరికొందరేమో గుడిలోకి వెళ్లేటపుడు కాళ్లు కడుక్కోవడం సాంప్రదాయం.. రామప్ప దేవాలయంలోకి దర్శనానికి వెళ్లేముందు మిస్ వరల్డ్ కంటెస్టెంట్ అదే చేసారని అంటున్నారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ వ్యవహారంపై రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 


.