హైద్రాబాద్‌లో కుండపోత: అధికారులతో తలసాని సమీక్ష, ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన
హైద్రాబాద్ లో వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్: నగరంలో వర్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. నగరంలో వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతవాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
మూడు రోజులుగా హైద్రాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హైద్రాబాద్ సూరారం చెరువు నీరు సమీపంలోని కాలనీని ముంచెత్తింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, గండిపేటకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో జంట జలాశయాల ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరో వైపు హుస్సేన్ సాగర్ కు కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.
హుస్సేన్ సాగర్ వద్ద వరద పరిస్థితిని నీటి పారుదల శాఖాధికారులు పరిశీలిస్తున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టం 514.75 అడుగులకు చేరుకుంది. ఎగువ నుండి భారీగా వరద వస్తుంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.మరో వైపు సరూర్ నగర్ చెరువుకు కూడ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సరూర్ నగర్ చెరువు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.