వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అభివృద్ధి, సాగునీరు, తాగునీరు ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. 

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా గైర్హాజరవుతున్న విషయంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో పెట్టిన ఏ అంశాలు కూడా అమలు చేయలేదన్నారు. తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామా అన్న మంత్రి.. బట్టకాల్చి మీద వేసే పనులు మానుకోవాలన్నారు. అధికారిక కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సరికాదని తలసాని హితవు పలికారు. అదానీ కోసం మోడీ తాపత్రయపడుతున్నారని.. శ్రీలంక ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా చెప్పిందని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. 

ఇంతవరకు ఈ విషయం గురించి మోడీ నోరు విప్పలేదని ఆయన దుయ్యబట్టారు. వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తలసాని ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. సినిమాటోగ్రఫీ, టూరిజం, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖలకు ఎన్నో అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఓ మోడల్ వుందని.. ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నాడని మంత్రి ప్రశంసించారు. పల్లె, పట్టణం ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. 

Also Read: మోడీ పర్యటనకు మరోసారి దూరంగా కేసీఆర్.. స్వాగత బాధ్యతలు తలసానికి..?

దేశంలో 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పాలని తలసాని నిలదీశారు. అభివృద్ధి, సాగునీరు, తాగునీరు ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దూసుకెళ్తోందని.. కానీ మా రాష్ట్ర ప్రజలు నూకలు తినమని ఓ కేంద్ర మంత్రి చెప్పాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవని తలసాని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్ , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మంత్రి మండిపడ్డారు. 

కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని.. కేసీఆర్ కుటుంబం ఉద్యమంలోంచి పుట్టిందని తలసాని ప్రస్తావించారు. ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాష్ట్రాల్లో సీఎంలుగా వున్నారని చురకలంటించారు. కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని మంత్రి ఆరోపించారు. సింగరేణిని అదానీకి కట్టబెట్టాలని చూస్తున్నారని.. ప్రోటోకాల్ పాటించనిది బీజేపీయేనని ఆయన దుయ్యబట్టారు. కరోనా వ్యాక్సిన్ ఇవ్వమని రాష్ట్రాలకు తేల్చిచెప్పారని ఆయన మండిపడ్డారు. 

Also Read: ప్రధాని మోదీ పర్యటన‌.. నిశ్శబ్దంగా మంత్రి తలసాని నిరసన!.. వందే భారత్ రైలును ప్రారంభిస్తున్న సమయంలో..

తెలంగాణ అభివృద్ధిపై మోడీ నీతులు చెబుతున్నారని.. ఇన్నేళ్లలో ఒక్క మెడికల్ కాలేజైనా ఇచ్చారా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బీబీ నగర్ ఎయిమ్స్ మీరు కట్టించారా.. ఒక్క బిల్డింగ్ కోసం భూమి పూజా అంటూ ఆయన నిలదీశారు. అదానీపై జేపీసీ వేయమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే పట్టించుకోలేదన్నారు. గతంలో భారత్ బయోటెక్ దగ్గరకు వచ్చినప్పుడు కేసీఆర్ ను రాకుండా చేసింది ఎవరని తలసాని ప్రశ్నించారు. ఇన్నేళ్లలో తెలుగు రాష్ట్రాలకు చేసింది ఏంటని ఆయన నిలదీశారు. 

కరోనా సమయంలో 23 లక్షల మంది కార్మికులను తెలంగాణ ప్రభుత్వం స్వస్థలాలకు పంపిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. తెలంగాణపై మోడీ తప్పుడు విమర్శలు చేశారని.. ఎంపీగా, కేంద్ర మంత్రిగా వుండి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశాని మంత్రి ప్రశ్నించారు.