గోదావరి వరదలతో జాగ్రత్త... తగ్గేవరకు విశ్రమించొద్దు : అధికారులతో మంత్రి పువ్వాడ
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో ఖమ్మం ప్రజలు అప్రమత్తంగా వుండాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

ఖమ్మం : తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతుండటంతో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నదీప్రవాహం ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలని మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా వుండాలని మంత్రి సూచించారు.
గోదావరి వరద ప్రభావం ఎక్కువగా వుండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వాహించారు. మొదట భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. అధికారులతో కలిసి భద్రాచలం బ్రిడ్జిపైకి చేరుకున్న మంత్రి వరద పరిస్థితిని అంచనా వేసారు. అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధికారులతో మంత్రి అజయ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులెవ్వరూ వరదలు తగ్గేవరకు విశ్రమించొద్దని మంత్రి పువ్వాడ సూచించారు. ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నదిలోకి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం వుందని... కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ వరదలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అధికారులను ఆదేశించారు.
Read More హైదరాబాద్‌లో కుండపోత.. నిండుకున్న హిమాయత్ సాగర్, కాసేపట్లో దిగువకు నీటి విడుదల
గోదావరి వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు మంత్రి సూచించారు.పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి భోజనం, త్రాగునీరుతో పాటు వ్యాధులబారిన పడకుండా వైద్యం అందించాలని ఆదేశించారు. వరదలతో ప్రాణనష్టం జరక్కుండా చూడాలని... వీలైనంత తక్కువగా ఆస్తినష్టం జరిగేలా చూడాలని మంత్రి పువ్వాడ సూచించారు.
ఇక ఖమ్మం జిల్లాలోని వాగులు వంకలు కూడా పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని మంత్రి సూచించారు. పోలీసులు ప్రజలు రాకపోకలను నియంత్రించాలని... లోతట్టు రహదారుల వద్ద బారికెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇళ్లలోంచి ప్రజలు బయటకు రాకూడదని... రైతులు, పశువుల కాపర్లు జాగ్రత్తగా వుండాలన్నారు. ఇక అధికారులు, సిబ్బంది గతంలో కంటే ఇంకా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.