Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో కుండపోత.. నిండుకున్న హిమాయత్ సాగర్, కాసేపట్లో దిగువకు నీటి విడుదల

హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి.  కాసేపట్లో హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. 

Himayath Sagar Gates to Open shortly amid heavy flow ksp
Author
First Published Jul 21, 2023, 4:40 PM IST

తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వాగులు, వంకలు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా ప్రాజెక్ట్‌లు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జలాశయాలు పరిమితిని మించి వున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు రాజధాని హైదరాబాద్‌ భారీ వర్షాలతో తడిసి ముద్ధవుతోంది. జూలై నెల మొత్తం కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే నమోదైంది. దీంతో నగరంలోని లోతట్టు కాలనీలు జలమయమవ్వగా.. జనావాసాల్లోకి వర్షపు నీరు చేరింది. 

మరోవైపు .. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు నిండుకున్నాయి. వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్ నగర్, షాబాద్ నుంచి జలాశయాల్లోకి భారీగా చేరుతున్న వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కాసేపట్లో హిమాయత్ సాగర్ జలాశయానికి చెందిన రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

ALso Read: కడెం ప్రాజెక్ట్‌లోకి భారీ వరద.. మొరాయించిన నాలుగు గేట్లు, భయాందోళనలో స్థానికులు

కాగా.. నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్‌లో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో గత రెండు మూడు రోజులు నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం జలాశయంలోకి వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 695.500 అడుగులకు చేరుకుంది. జలాశయంలో లక్షా 86 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శుక్రవారం ఉదయం 9 గేట్లు ఎత్తి గోదావరిలోకి 1,43,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. 

అటు.. కడెం ప్రాజెక్ట్‌లోని  2, 3, 16, 18 నెంబర్ గేట్లు మొరాయిస్తూ వుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని..అధికారులు అండగా వుంటారని వారు భరోసా కల్పించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios