సారాంశం

బీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. మీరు భయపెడితే.. మేం భయపడమని వ్యాఖ్యానించారు. తాను సీఎం కావడానికి మోడీ పర్మిషన్ అవసరం లేదని .. అందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజల అనుమతి వుంటే చాలని మంత్రి తేల్చిచెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్‌లపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి కేటీఆర్. తాను సీఎం కావడానికి మోడీ పర్మిషన్ అవసరం లేదని .. అందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజల అనుమతి వుంటే చాలని మంత్రి తేల్చిచెప్పారు. ఈసారి బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదన్నారు. ఇవాళ మోడీ మాట్లాడిన మాటల్లోనే ఆయన ఫ్రస్ట్రేషన్ బయటపడుతోందన్నారు. తాము ఢిల్లీ గులాములం కాదని, గుజరాతీ బానిసలం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. 

దేవెగౌడ కొడుకు కుమారస్వామి.. ఎన్డీయేలో చేరినప్పుడు రాచరికం గుర్తురాలేదా అని మంత్రి ప్రశ్నించారు. జై షా ఎవరు.. బీసీసీఐ జనరల్ సెక్రటరీ పదవి ఎందుకిచ్చారని కేటీఆర్ నిలదీశారు. హిమంతు బిశ్వ శర్మ, జ్యోతిరాధిత్య సింధియాపై వున్న కేసులు వాళ్లు బీజేపీలో చేరాక ఏమయ్యాయని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పే మోడీతో మేం ఎందుకు కలవాలి.. తాము కర్టాటకకు డబ్బులు పంపుతుంటే మీ ఐటీ టీమ్ ఏం చేస్తోందని కేటీఆర్ నిలదీశారు. 

ప్రధాని ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడి సీఎంలను అవినీతి ముఖ్యమంత్రులని వ్యాఖ్యానిస్తారని మంత్రి ఫైర్ అయ్యారు. అదానీ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారు.. జేపీసీ ఎందుకు వేయరని కేటీఆర్ ప్రశ్నించారు. 70 ఏళ్ల వయసులో మోడీ తన పదవికి తగినట్లుగా వ్యవహరించాలని ఆయన చురకలంటించారు. ఇప్పుడు ఎన్డీయేను కీలక పార్టీలు వదిలేశాయని.. వాళ్లకు మిగిలింది ఈడీ, సీబీఐనే అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక ప్రధాని, ఒక సీఎం మధ్య మీటింగ్ జరిగిందని.. ఇప్పుడు ప్రధాని అబద్ధం చెబితే ఏం చేయాలని మంత్రి ప్రశ్నించారు. 

Also Read: జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఇస్తాం, ఎన్డీయేలో చేరతామని కేసీఆర్ అడిగారు.. కుదరదన్నా : బాంబు పేల్చిన మోడీ

మీరు భయపెడితే.. మేం భయపడమని వ్యాఖ్యానించారు. అకాళీదళ్, పీడీపీ, టీడీపీ, శివసేన, జేడీఎస్‌ల వియంలో రాచరికం గుర్తు రాలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఎవరికీ గులాం కాదని.. ఈసారి 110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ రాదని కేటీఆర్ సవాల్ విసిరారు. గత 9 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాజు, యువరాజు అంటూ మోడీ ఏదేదో మాట్లాడారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఆయనతో వుంటే మంచి అంటారు.. లేదంటే రాచరికం అంటారని మంత్రి ఫైర్ అయ్యారు. మోడీ సినిమాలకు స్టోరీలు రాస్తే ఆస్కార్ కూడా వస్తుందని కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ ఫైటర్ అని.. ఛీటర్‌తో కలిసి పనిచేయరని ఎద్దేవా చేశారు. మోడీ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదన్నారు.