తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు.
సిరిసిల్ల : గతంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ చేసారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లో K అంటూ కాలువలు, C అంటే కెనాల్స్, R అంటూ రిజర్వాయర్లు... ఈ పేరే 'రైతు బంధు' అని కేటీఆర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు చుక్క నీరిచ్చే రిజర్వాయర్ లేదు కానీ కేసీఆర్ పాలనలో లక్షలాది ఎకరాలను నీరందించే రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని కేటీఆర్ అన్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో నిర్మించిన వ్యవసాయ కళాశాల భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వ్యవసాయ కళాశాలలోని అత్యాధునిక వసతులు, అత్యుత్తమ విద్యను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వకారణంగా నిలిచే వ్యవసాయ నిపుణులుగా తయారవుతారని విద్యార్ధులకు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయాభివృద్దికి ప్రభుత్వం కృషిచేస్తోందని... ఇందుకు నైపుణ్యం కలిగిన అగ్రికల్చర్ విద్యార్థులు తోడయితే అద్భుతాలు సృష్టించవచ్చని కేటీఆర్ అన్నారు.
Video వ్యవసాయ కళాశాల భవనాన్ని ప్రారంభించిన కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందని కేటీఆర్ అన్నారు. కళాశాల భవన ప్రారంభోత్సవం కోసం హెలికాప్టర్ లో వస్తుంటే వరుసగా కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానెరు జలశయాలు కనబడ్డాయని అన్నారు. ఈ రిజర్వాయర్ల కిందసాగవుతున్న లక్షలాది ఎకరాల పచ్చటి పంటలు కనిపించాయని అన్నారు.
తెలంగాణ యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా పదిమందికి ఉద్యోలిచ్చే ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారాలని కేటీఆర్ సూచించారు. అంతేకాదు మంచి పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి రాష్ట్ర ప్రగతికి తమవంతు సహకారం అందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించేలా సహకరిస్తోందని కేటీఆర్ అన్నారు.
వ్యవసాయం శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... నేటి తరానికి మార్గదర్శకత్వం, రేపటి తరానికి నాయకత్వం వహించే దక్షత ఉన్న నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఇలాంటి నాయకుడు తెలంగాణకు మంత్రిగా సేవలందించడం గర్వకారణమని అన్నారు.
ఆధునిక వసతులు, సాంకేతికత పద్దతులతో కూడిన కళాశాల రావడం విద్యార్ధుల అదృష్టమని మంత్రి అన్నారు. సమైక్య రాష్ట్రంలో సరిపడా భూములు ఉన్న ధాన్యం కోసం వెంపర్లాడే పరిస్థితి వుండేదన్నారు. ఈ పరిస్థితులు చూసే సిఎం కేసిఆర్ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఓ కొత్త విప్లవాన్ని తెచ్చిందన్నారు. దేశానికే తెలంగాణ అన్నంపెట్టే అన్నపూర్ణగా కేసిఆర్ మార్చారని నిరంజన్ రెడ్డి అన్నారు.
