తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కంటిలో నలుసులా, చెవిలో జొర్రీగలా మారి ఇబ్బందులపాలు చేస్తున్నారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. తెలంగాణ సర్కారు వైఫల్యాల పై గత ఏడాది కాలంగా పోరుబాట పట్టింది జెఎసి. మిగతా రాజకీయ పక్షాలను మించిన రీతిలో జెఎసి సర్కారు వైఫల్యాలపై గట్టిగానే ఫైట్ చేస్తోంది. తెలంగాణ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు పరిమితమైన వనరులతోనే యుద్ధం చేస్తోంది తెలంగాణ జెఎసి. ఈ పోరాటంలో అనేక విజయాలు సాధించింది. సర్కారు వైఫల్యాలను ఎండగట్టింది.

అమరుల స్పూర్తి యాత్ర, కొలువులకై కొట్లాట కార్యక్రమాలు తెలంగాణ సర్కారుకు చిరాకు పెట్టించాయి. అమరుల స్పూర్తి యాత్రను తెలంగాణ జెఎసి వ్యూహాత్మకంగా చేపట్టింది. తొలుత తొలి దశలో కేసిఆర్ కుటుంబసభ్యులు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఏరియాల్లో స్పూర్తి యాత్ర ప్లాన్ చేసి షాక్ ఇచ్చింది జెఎసి. సరే అది అలా జరుగుతూనే ఉన్నది. తాజాగా మంత్రి కేటిఆర్ కోటపై జెఎసి నేత కోదండరాం గురి పెట్టారు. ఆ వివరాలు కింద చదవండి.

కేటిఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ఇసుకమాఫియా రాజ్యమేలుతోంది. అక్కడ ఇసుకమాఫియాకు పోలీసులు మద్దతుగా నిలిచారన్న విమర్శలు గుప్పుమన్నాయి. కేసిఆర్ ఫ్యామిలీపైనే విమర్శలు వచ్చాయి. కేసిఆర్ కుటుంబం కనుసన్నల్లోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుందన్న విమర్శలను విపక్షాలు గుప్పించాయి. అక్కడి దళితులను పోలీసులు చితకబాది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆరుగురి చావుకు ఇసుక మాఫియా కారణమైందన్న ఆరోపణలున్నాయి. ఈ కేసు తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం రేపింది. బాధితులను పరామర్శించేందుకు మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ స్వయంగా వచ్చారంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కేసులో పోలీసుల చేతిలో దెబ్బలు తిని మంచం పట్టిన బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. మొన్నటికి మొన్న ఒక బాధితులు ఆత్మహత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించి సంచలన విషయాలు వెల్లడించాడు. కేటిఆర్ కొట్టమంటేనే పోలీసులు కొట్టారని పోలీసులు అన్నట్లు ఆ బాధిత యువకుడు తెలిపారు.

ఈ పరిస్థితుల్లో నేరెళ్ళ ఇసుక మాఫియా బాధితులకు న్యాయం కోసం కోదండరాం సిద్ధిపేట నుంచి నేరెళ్ల వరకు పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఈనెల 6వ తేదీన శనివారం ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర ద్వారా తెలంగాణ సర్కారు నిజస్వరూపాన్ని ప్రజల ముందుంచుతామని జెఎసి చెబుతున్నది. నేరెళ్ల దళితులకు న్యాయం చేయాలని కోరుతూ సిద్ధిపేట అమరవీరుల స్థూపం నుంచి నేరెళ్ల గ్రామానికి పాదయాత్ర సాగనుంది. శనివారం (6వ తేదీన) ఉదయం 9 గంటలకు అఖిలపక్ష నేతలతో కలిసి జెఎసి పాదయాత్ర సాగనుంది. ఈ యాత్ర ద్వారా తెలంగాణ సర్కారు ఇసుక మాఫియాను సర్కారే నడుపుతున్న విషయాన్ని తేటతెల్లం చేయడంతోపాటు దళితుల పట్ల సర్కారు అవలంభిస్తున్న తీరును ఎండగడతామని జెఎసి నేత ఒకరు ఏషియానెట్ కు తెలిపారు. మంద కృష్ణ మాదిగను అకారణంగా రెండుసార్లు అరెస్టు చేయడం, దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటివి తెలంగాణ సర్కారు దళిత వ్యతిరేక చర్యలుగా తాము భావిస్తున్నట్లు చెప్పారు.

మొత్తానికి ఈసారి కోదండరాం టార్గెట్ కేటిఆర్ అయ్యారని చెబుతున్నారు.