మూసి నదిపై త్వరలో బ్రిడ్జీలకు శంకుస్థాపన చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ రోజు నార్సింగ్ ఇంటర్ చేంజ్ ప్రారంభించిన ఆయన త్వరలో 21వ ఇంటర్ చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. 

హైదరాబాద్: రాజధానిలోని నార్సింగ్ పోలీసు స్టేషన్ సమీపంలో రూ. 29.50 కోట్ల వ్యయంతో హెచ్ఎండీఏ నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయం ప్రారంభించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై మరొక ఇంటర్ చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. నార్సింగి ఇంటర్ చేంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఓఆర్ఆర్ చుట్టూ పెరుగుతున్న జనసాంధ్రతను దృష్టిలో పెట్టుకుని సరిపడా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మరికొన్ని ఇంటర్‌చేంజ్‌లను నిర్మిస్తామని వివరించారు. త్వరలో 21వ ఇంటర్ చేంజ్ మల్లంపేట వద్ద అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లను ఫోర్ లైన్లుగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపడుతామని వివరించారు.

మూసీ నది అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలో మూసీపై బ్రిడ్జీల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. మొత్తం 14 బ్రిడ్జీల్లో ఐదింటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఈ నది పై రూ. 10 వేల కోట్ల వ్యయంతో 55 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ స్కై వే నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు.

Also Read: Andhra Pradesh: వివాహిత ఫొటోలు మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న భర్తకు పంపిన దుర్మార్గుడు.. రంగంలోకి దిశ టీం

తన ఢిల్లీ పర్యటనలో మెహెదీపట్నం స్కై వాక్ నిర్మాణానికి అర ఎకరం రక్షణ శాఖ స్థలాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో ఈ వినతిపై గుడ్ న్యూస్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండున్నర సంవత్సరాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైలు అందుబాటులోకి వస్తుందని వివరించారు. శంషా బాద్ అనతి కాలంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.