ఆంధ్రప్రదేశ్‌లో ఓ వివాహిత ఫొటోలు మార్ఫింగ్ చేసిన ఓ దుండుగుడు వాటిని ఆమె భర్తకు పంపించాడు. దుబాయ్‌లో ఉన్న భర్తకు, ఏపీలో ఉన్న భార్యకు మధ్య చిచ్చు పెట్టాడు. దీంతో బాధిత మహిళ దిశ ఎస్‌వోఎస్‌కు ఫోన్ చేసింది.
అమరావతి: ఓ దుర్మార్గుడు తనకు తెలిసిన మహిళ కాపురంలో చిచ్చు పెట్టాడు. సంతోషంగా సాగుతున్న దాంపత్యంలో నిప్పులు పోశాడు. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న ఆమె భర్తకు పంపించాడు. దీంతో భార్య భర్తల మధ్య ఘర్షణలు ప్రారంభం అయ్యాయి. ఏమి చేయాలో పాలుపోని ఆ వివాహిత దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. దిశ టీం వెంటనే రంగంలోకి దిగి ఆమెకు భరోసా ఇచ్చింది. నిందితుడిపై కేసు ఫైల్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కోనసీమా జిల్లా గోపాలపురానికి చెందిన అచ్చిరెడ్డి, మీనా అనే మహిళను నాలుగేళ్ల క్రితం ప్రేమ పేరుతో వెంటబడి వేధించాడు. అప్పుడే అచ్చిరెడ్డిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆమెను ఇబ్బంది పెట్టనని పెద్దమనుషుల ముందు అచ్చిరెడ్డి చెప్పడంతో వివాదం ముగిసింది.
ఆ తర్వాత కొన్ని నెలలకు మీనాను రావులపాలేనికి చెందిన పెద్దిరెడ్డితో మీనా పెళ్లి జరిపించారు. వారి దాంపత్యం హ్యాపీగా సాగింది. ఆయన ఉపాధి రీత్యా కొన్ని రోజుల క్రితమే దుబాయ్ వెళ్లాడు. ఆయన దుబాయ్ వెళ్లిన తర్వాత అచ్చిరెడ్డి వేధింపుల పర్వం మళ్లీ మొదలైంది. అచ్చిరెడ్డి గతంలో మీనాతో దిగిన ఫొటోలను ఆధారంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి దుబాయ్‌లో ఉన్న పెద్దిరెడ్డికి పంపించాడు.
Also Read: EMI: లోన్ ఈఎంఐ కట్టలేదని ఆ కస్టమర్ కూతురిని కిడ్నాప్ చేసిన సిబ్బంది
మీనాకు ఏమి చేయాలో పాలుపోలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దిశ ఎస్‌వోఎస్ సహాయం తీసుకుంది. దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసి తాను ఎదుర్కొన్న ఘటనలను వివరించింది. అచ్చిరెడ్డిపై ఫిర్యాదు చేసింది.
కాల్ చేసిన నిమిషాల వ్యవధిలోనే దిశ టీమ్ రావులపాలెంలోని మీనా లొకేషన్‌కు చేరుకుంది. మార్ఫింగ్ ఫొటోలను, బ్లాక్ మెయిలింగ్‌కు సంబంధించిన సమాచారాన్ని వారు సేకరించారు. అనంతరం, ఐపీసీలోని సెక్షన్ 354 డీ కింద కేసు ఫైల్ చేశారు. ఆమెకు భరోసా కల్పించి ధైర్యంగా ఉండాలని సూచించారు.
