హైదరాబాద్: తెలంగాణ ఐటీ,  పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ చాయ్ వాలాకు ఆపన్నహస్తం అందించారు. ప్రభుత్వ చర్యలతో తాను ఉపాధి కోల్పోయి కుటుంబం ఆకలితో అలమటించే దయనీయ పరిస్ధితి ఏర్పడిందని చాయ్ వాలా తన ఆవేదనను వెల్లగక్కుతూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి అతడు ప్రభుత్వం చర్యల కారణంగా ఏదయితే జీవనోపాధి కోల్పోయాడో అదే తిరిగి అందేలా చూశాడు. దీంతో చాయ్ వాలా ముఖంలోనే కాదు కుటుంబం మొత్తంలో ఆనందం వెల్లివిరిసింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో శివారెడ్డి అనే వ్యక్తి రోడ్డుపక్కన చాయ్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇటీవల ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో అతడి చాయ్ బండిని అధికారులు తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోవడంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. దీంతో అతడు తన దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆదుకోవాలంటూ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు.

read more  కేసీఆర్ కృషివల్లే... తెలంగాణలో మరో హరితవిప్లవం: మంత్రి కేటీఆర్

శివారెడ్డి ట్వీట్ కు స్పందించిన మంత్రి వెంటనే అతడిని ఆదుకుని అండగా నిలవాలని ఉప్పల్ టీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ వెంటనే స్పందించి శివారెడ్డి చేత తిరిగి చాయ్ బండిని పెట్టించాడు. ఈ ఛాయ్ బండిని స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా తనకు కొత్త జీవితాన్ని అందించిన మంత్రి కేటీఆర్ కు శివారెడ్డి కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. ఆయనకు తామెప్పుడూ రుణపడి వుంటామని... సహాయం అందించిన ప్రతి ఒక్కరికీ శివారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.