Asianet News TeluguAsianet News Telugu

వ్యవస్ధలను వేట కుక్కల్లా ప్రత్యర్ధులకు మీదకి వదులుతోంది: కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని కేంద్రం తుంగలో తొక్కుతోందని కేటీఆర్ మండిపడ్డారు. 

minister ktr fires on union govt
Author
Hyderabad, First Published Apr 14, 2022, 4:35 PM IST

ఎంతో దూరదృష్టి , సుదీర్ఘ కసరత్తుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) దళిత బంధు (dalitha bandhu) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు మంత్రి కేటీఆర్ (ktr) . గురువారం సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఒకేసారి పది లక్షలు ఖర్చు పెట్టే అవకాశం లేకపోతే దానిని రెండు విడతలుగా చెల్లిస్తామని మంత్రి చెప్పారు. కొత్త కొత్త ఆలోచనలు చేసి అభివృద్ధి  చెందాలని కేటీఆర్ పేర్కొన్నారు. సంప్రదాయంగా ఆలోచించకుండా.. సాంప్రదాయేతరంగా ఆలోచించాలని మంత్రి సూచించారు. 

అంబేద్క‌ర్ (ambedkar jayanti) రాసిన రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌ను త‌మ ఆధీనంలో పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద‌కు వేట కుక్క‌ల మాదిరిగా ఉసిగొల్పుతున్న కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుదామన్నారు. హైద‌రాబాద్ న‌డిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ప్ర‌తిష్టిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్క‌ర్ వాదులంద‌రూ.. హైద‌రాబాద్ వైపు చూసే రోజు త్వ‌ర‌లోనే రాబోతుంద‌ని మంత్రి అన్నారు. 

అంబేద్క‌ర్ క‌ల‌లుగ‌న్న స‌మాజం తెలంగాణ‌లో ఆవిష్కృతం కాబోతుంద‌ని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ద‌ళిత పారిశ్రామికవేత్త‌ల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు టీ ప్రైడ్ ప్ర‌వేశ‌పెట్టామ‌ని మంత్రి తెలిపారు. ఈ ప‌థ‌కం కింద 200 కోట్ల రాయితీల‌ను 3 వేల మంది ద‌ళిత పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అందించామ‌ని కేటీఆర్ గుర్తుచేశారు. అధికార వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా కొత్త జిల్లాల‌ను, రెవెన్యూ డివిజ‌న్ల‌ను, మండ‌లాల‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. గిరిజ‌న సోద‌రుల కోసం తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా తీర్చిదిద్దిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఎస్సీ విద్యార్థుల కోసం గురుకులాల‌ను స్థాపించి, అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని కేటీఆర్ వెల్లడించారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య చ‌రిత్ర‌లో ఏ ప్ర‌ధాని, ఏ ముఖ్య‌మంత్రి ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌లేదని మంత్రి వ్యాఖ్యానించారు. మంచి ప‌నులు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని అభినందించాలని..  అంబేద్క‌ర్ జ‌యంతి అంటే భ‌య‌పెట్టే ప‌రిస్థితులు తేవొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ద‌ళితుల కోసం చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios