పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా అని మంత్రి నిలదీశారు.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. 12 మంది ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మీకో న్యాయం.. మాకో న్యాయమా అని మంత్రి నిలదీశారు. అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేదు.. తాగునీరు లేదన్నారు మంత్రి కేటీఆర్.
మరోవైపు.. తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనపై వారు చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తానని కాంతారావు హెచ్చరించారు. అంతేకాకుండా వాళ్లపై పరువు నష్టం దావా కూడా వేస్తానని రేగా స్పష్టం చేశారు.
ALso REad: ఖబడ్దార్ .. నాతో పెట్టుకోకు : రేవంత్ రెడ్డికి రేగా కాంతారావు వార్నింగ్, పరువు నష్టం దావాకు రెడీ
పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించింది తానేనని, ఇక్కడ పార్టీకి బలం వుందంటే తనవల్లనేనని ఆయన పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షునిగా తానే ఎక్కువ కాలం పనిచేశానని రేగా కాంతారావు అన్నారు. గిరిజనుడిని అనే అక్కసుతో తనను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్‌లో విలీనమయ్యానని , తాను 300 ఎకరాలు ఆక్రమించినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని రేగా కాంతారావు సవాల్ విసిరారు.
తాను తలచుకుంటే అసలు మణుగూరులో మీటింగ్ జరగదని.. కానీ తనకు విజ్ఞత వుంది కాబట్టే వదిలేశానని ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లయినా మీటింగ్ పెట్టుకోవచ్చునని.. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారం వుండాలని రేగా కాంతారావు అన్నారు. పేల్చేస్తాం, కూల్చేస్తాం, కొడతాం అంటే అది పద్ధతి కాదని ఎమ్మెల్యే చురకలంటించారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్ .. రేగా కాంతారావుతో పెట్టుకోకని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
