తనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తాను తలచుకుంటే అసలు మణుగూరులో మీటింగ్ జరగదని..రేగా కాంతారావుతో పెట్టుకోవద్దని హెచ్చరించారు.  

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తదితర కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనపై వారు చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులపై పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తానని కాంతారావు హెచ్చరించారు. అంతేకాకుండా వాళ్లపై పరువు నష్టం దావా కూడా వేస్తానని రేగా స్పష్టం చేశారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించింది తానేనని, ఇక్కడ పార్టీకి బలం వుందంటే తనవల్లనేనని ఆయన పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షునిగా తానే ఎక్కువ కాలం పనిచేశానని రేగా కాంతారావు అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గిరిజనుడిని అనే అక్కసుతో తనను తొలగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజ్యాంగబద్ధంగా బీఆర్ఎస్‌లో విలీనమయ్యానని , తాను 300 ఎకరాలు ఆక్రమించినట్లు రుజువు చేస్తే ముక్కు నేలకు రాస్తానని రేగా కాంతారావు సవాల్ విసిరారు. తాను తలచుకుంటే అసలు మణుగూరులో మీటింగ్ జరగదని.. కానీ తనకు విజ్ఞత వుంది కాబట్టే వదిలేశానని ఆయన పేర్కొన్నారు. ఏ పార్టీ వాళ్లయినా మీటింగ్ పెట్టుకోవచ్చునని.. కానీ మాట్లాడేటప్పుడు సంస్కారం వుండాలని రేగా కాంతారావు అన్నారు. పేల్చేస్తాం, కూల్చేస్తాం, కొడతాం అంటే అది పద్ధతి కాదని ఎమ్మెల్యే చురకలంటించారు. రేవంత్ రెడ్డి ఖబడ్దార్ .. రేగా కాంతారావుతో పెట్టుకోకని ఆయన వార్నింగ్ ఇచ్చారు.