వరంగల్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు

వరంగల్ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. గుజరాత్‌కు 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన ప్రధాని.. తెలంగాణకు మాత్రం రూ.520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ప్రధానిగా మోడీ నిలిచిపోతారని మంత్రి ఎద్దేవా చేశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని కేటీఆర్ గుర్తుచేశారు. 

తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేస్తామో చెప్పకుండా ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు. గడిచిన 9 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని.. అది గుర్తుంచుకుని రాష్ట్ర ప్రజలు బీజేపీని తన్ని తరిమేస్తారని మంత్రి జోస్యం చెప్పారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాలేదని, సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ పున: ప్రారంభం కాలేదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో కొత్త జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి డిమాండ్లను పక్కనబెడుతున్న ప్రధానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. 

ALso Read: కేసీఆర్ సర్కార్ అవినీతి ఢిల్లీ వరకు పాకింది.. వారు చేసేది 4 పనులే: బీఆర్ఎస్‌పై మోదీ తీవ్ర విమర్శలు..

నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని హేళన చేశారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా , ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు అందించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని కాగానే.. మోడీ రద్దు చేశారని మంత్రి గుర్తుచేశారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో వున్న ఖాళీలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టారని దుయ్యబట్టారు. 

వ్యవసాయ చట్టాల కారణంగా 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. కార్పోరేట్ మిత్రులకు రూ.12.5 లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు తాము భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. పిట్టబెదిరింపులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడదన్నారు. కుటుంబపాలన, అవినీతి గురించి మోడీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వుందన్నారు. బీజేపీ నేతల కుటుంబ సభ్యులే కేంద్ర కేబినెట్‌లో సభ్యులుగా వున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.