వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టిపిసిసి చీప్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలో లేక రైతులు మూడుపంటలు సైతం పండించుకునేలా చూస్తున్న కేసీఆర్ పాలన కావాలో తెలంగాణ ప్రజలకు తెలుసంటున్నారు బిఆర్ఎస్ నాయకులు. ఇలా రేవంత్ ఉచిత కరెంట్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది బిఆర్ఎస్. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి టికాంగ్రెస్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదని... ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ కరెంట్ కోతలతో రైతాంగానికి వాతలు తప్పవని జగదీష్ రెడ్డి అన్నారు. మూడు గంటలే ఉచిత కరెంట్ చాలంటూ రేవంత్ ఊరకే అనలేదని... ఏఐసిసి నిర్ణయాన్నే బుడ్డర్ ఖాన్ తో పాటు పర్ పులులు బహిర్గతం చేసాయన్నారు.ఒకవేళ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎనిమిది గంటల విద్యుత్ సరఫరానే కాంగ్రెస్ రహస్య ఎజెండాగా పెట్టుకుందన్నారు. 24 గంటల విద్యుత్ విధానం కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. 

ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడకూడా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంలేదని మంత్రి తెలిపారు. చత్తీస్ ఘడ్ లో అధికారంలో వున్న కాంగ్రెస్ వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్ సరఫరా చేస్తోందన్నారు. ఇదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలన్నిది కాంగ్రెస్ రహస్య ఎజెండా... అందువల్లే బుడ్డర్ ఖాన్ నోటివెంట మూడుగంటల విద్యుత్ మాటలు వచ్చాయన్నారు. 

Read More మైనార్టీలకు రూ.లక్ష సాయం.. మరో కొత్త పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం

ఇక బిజెపి పాలిత, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అయితే వ్యవసాయానికి కేవలం ఆరు గంటలే విద్యుత్ సరఫరా చేస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. అదే పార్టీ పాలిస్తున్న ఉత్తర ప్రదేశ్ లో అయితే ఇప్పటికీ కరెంట్ లేని గ్రామాలు కోకొల్లలుగా వున్నాయన్నారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజలు ముందుచూపుతో గులాబీ జెండా ఎత్తుకున్నారు... లేకపోతే ఇక్కడా అలాంటి పరిస్థితులే వుండేవన్నారు విద్యుత్ మంత్రి. 

ఇక పేపర్ పులి రేవంత్ నోటివెంట సంక్షేమ పథకాలు ఎత్తివేత వ్యాఖ్యలు కూడా వచ్చాయని మంత్రి తెలిపారు. జరగకూడనిది జరిగి ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆసరా ఫించన్లు తిరిగి రూ.200 కు కుదించడంతో పాటు కల్యాణలక్ష్మి, షాది ముబారక్, రైతుబందు, రైతుభీమా ఎత్తివేస్తారని... ఇందుకు ఇప్పటికే ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. జరుగుతున్న అభివృద్ధి కొనసాగింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని విద్యుత్ మంత్రి అన్నారు.