సుదీర్ఘకాలం విప్లవోద్యమంలో పనిచేసి ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసిన సత్యం రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసారు. 

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే వామపక్ష పార్టీలైన సిపిఐ,సిపిఎం పార్టీలకు దగ్గరైన బిఆర్ఎస్ తాజాగా మావోయిస్టుల మద్దతును కూడా పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా 17ఏళ్ళు జైలుజీవితం గడిపి ఇటీవలే విడుదలైన మాజీ మావోయిస్టు గజ్జల సత్యం రెడ్డితో మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణా ఏర్పాటు, బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి జగదీష్ రెడ్డికి సత్యంరెడ్డికి వివరించారు. జనజీవన స్రవంతిలో కలిసిన సత్యంరెడ్డి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... 43 ఏళ్ల అనంతరం తిరిగి స్వస్థలానికి చేరుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చిన సత్యం రెడ్డికి జగదీష్ రెడ్డి అభినందనలు తెలిపారు.ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటం, ఉద్యమ అనుభవాల గురించి సత్యంరెడ్డికి వివరించారు. 

Read More నా ప్రాణాలకు ముప్పు.. రక్షణ కల్పించండి : హైకోర్టులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్

మాజీ మావోయిస్టు నేత సత్యం రెడ్డి మాట్లాడుతూ... స్వరాష్ట్ర ఏర్పాటుతర్వాత తెలంగాణలో పెద్ద మార్పు జరిగిందని అన్నారు. తాను ఉద్యమంలోకి వెళ్ళేముందు ఉన్న తెలంగాణకు ప్రస్తుతమున్న తెలంంగాణ కు అసలు పోలీకే లేదని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన అభివృద్ది మరే రాష్ట్రంలోనూ లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ది సాధించిందని సత్యం రెడ్డి పేర్కొన్నారు. 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామానికి చెందిన సత్యంరెడ్డి హైదరాబాద్ ఏవి కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. ఈ సమయంలోనే విప్లవోద్యమాల పట్ల ఆకర్షితుడై 1980 లో పీపుల్ పార్టీలో చేరి గోపన్నగా మారారు. అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్ట్ పార్టీ దండకారణ్య విస్తరణ కమిటీల్లో కీలకంగా వ్యవహరించారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన సత్యంరెడ్డినొ 2006 లో పోలీసులు అరెస్ట్ చేసారు. అప్పటినుండి దాదాపు 17ఏళ్లపాటు చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ జైళ్లో శిక్ష అనుభవించారు. ఇటీవలే జైలునుండి విడుదలై ఇంటికి చేరుకున్న సత్యంరెడ్డితో తాజాగా మంత్రి భేటీ అయ్యారు.