ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై మండిపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. బండి సంజయ్ మాటలకు, మోడీ మాటలకు తేడా లేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోడీ తెలంగాణపై విషం చిమ్మారని ఆయన విమర్శించారు. గుజరాత్‌లో నేటికి ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చే పరిస్ధితి లేదన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మోడీ ఓర్వలేకపోతున్నారని.. సభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్‌ను చూసి మోడీకి భయం ఎందుకని మంత్రి ప్రశ్నించారు. బండి సంజయ్ మాటలకు, మోడీ మాటలకు తేడా లేదని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రధాని పర్యటన వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదని..విపక్ష నేతలకు సీబీఐ, ఈడీల నుంచి నోటీసులు వస్తున్నాయని.. బీజేపీలో చేరితే అలాంటివి వుండవన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదన్నారు. 

అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో పెట్టిన ఏ అంశాలు కూడా అమలు చేయలేదన్నారు. తాము అభివృద్ధిని అడ్డుకుంటున్నామా అన్న మంత్రి.. బట్టకాల్చి మీద వేసే పనులు మానుకోవాలన్నారు. అధికారిక కార్యక్రమానికి వచ్చి రాజకీయాలు మాట్లాడటం సరికాదని తలసాని హితవు పలికారు. అదానీ కోసం మోడీ తాపత్రయపడుతున్నారని.. శ్రీలంక ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా చెప్పిందని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. 

ALso Read: వివాదం ఆ రోజు నుంచే మొదలు.. అందుకే మోడీ టూర్‌కి కేసీఆర్‌ దూరం : అసలు విషయం చెప్పిన తలసాని

ఇంతవరకు ఈ విషయం గురించి మోడీ నోరు విప్పలేదని ఆయన దుయ్యబట్టారు. వందే భారత్ రైళ్లను ఎన్నిసార్లు ప్రారంభిస్తారని తలసాని ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే ఇన్ని అవార్డులు ఎందుకిస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు. సినిమాటోగ్రఫీ, టూరిజం, పంచాయతీరాజ్, పురపాలక తదితర శాఖలకు ఎన్నో అవార్డులు వచ్చాయని తలసాని గుర్తుచేశారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఓ మోడల్ వుందని.. ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నాడని మంత్రి ప్రశంసించారు. పల్లె, పట్టణం ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి కనిపిస్తోందన్నారు. 

దేశంలో 24 గంటల కరెంట్ ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పాలని తలసాని నిలదీశారు. అభివృద్ధి, సాగునీరు, తాగునీరు ఏ విషయంపైనైనా చర్చకు సిద్ధమని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దూసుకెళ్తోందని.. కానీ మా రాష్ట్ర ప్రజలు నూకలు తినమని ఓ కేంద్ర మంత్రి చెప్పాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవని తలసాని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్ , నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని మంత్రి మండిపడ్డారు.