సభలో నడుచుకునే పద్ధతి అదేనా? కాంగ్రెస్ తీరు మారకపోతే కఠినంగా ఉంటాం కాంగ్రెస్ ఏకాకి అయిపోయింది

శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి గట్టి హెచ్చరికలు పంపిండు. అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలిరోజే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుందని విమర్శించారు. ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడిపిస్తాం అని సీఎం ఇప్పటికే ప్రకటించినా..పోడియం లోకి వచ్చి ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.

కాంగ్రెస్ అలా వ్యవహరించినా.. బీజేపీ, టీటీడీపీ, ఎంఐఎం, తెరాస ప్రశ్నోత్తరాల్లో పాల్గొన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ది సరైన పద్ధతి కాదని అక్బరుద్దీన్ కూడా కుండబద్దలు కొట్టి చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 19 అంశాలను మాట్లాడదాం అని నిన్ననే సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అసహనం తో వ్యవహరిస్తోందో చెప్పాలన్నారు.

ఇవాళ సభ అంతా ఒక దిక్కు ఐతే... కాంగ్రెస్ ఏకాకి అయిపోయిందన్నారు. కాంగ్రెస్ చర్చ కోరుకోవడం లేదు... రచ్చ కోరుకుంటుందన్న విషయం తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులకు జానారెడ్డి మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టు ఉంది కదా అని ఎద్దేవా చేశారు. సభా నాయకుడు మాట్లాడేటప్పుడు కూడా స్లోగన్స్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు.

రైతుల పై కాంగ్రెస్ చూపిస్తోంది మొసలి కన్నీరే అనేది అందరికీ తెలుసన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ 3 ఏళ్ళు అయినా ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ ది అని గుర్తు చేశారు. ఇవాళ మేం రైతులకు చేస్తున్న అభివృద్ధి ని చూసి కాంగ్రెస్ కళ్ళల్లో కన్నీరు పెట్టుకుంటోందన్నారు. రైతులకు ఎకరానికి రూ. 8 వేలు రైతులకు ఇస్తామంటే కాంగ్రెస్ కు ఎందుకు బాధేస్తోందని నిలదీశారు.

ఒకే సంవత్సరం 16 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గోడౌన్స్ ను కట్టించామని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేస్తే మీకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. దశాబ్దాల తరబడి ఇరిగేషన్ ప్రాజెక్టుల ను పెండింగ్ పెట్టారని ఆరోపించారు. మీరు పెండింగ్ ప్రాజెక్టులు పెడితే... మేం రన్నింగ్ ప్రాజెక్టులు చేశామన్నారు. కాంగ్రెస్ దగ్గర సబ్జెక్టు లేకనే ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ ఇలాంటి వ్యవహార శైలి ని ప్రదర్శిస్తే సభలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కఠినంగా హెచ్చరిస్తామన్న హరీష్ వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఈ సెషన్ లో మాట్లాడనిస్తరా? లేక కఠినంగా అంటే ఇంకేదైనా చర్యలు తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/eSvdXQ