Asianet News TeluguAsianet News Telugu

అన్ని కాకి లెక్కలే.. కేసీఆర్ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానమిచ్చారా : నీతి ఆయోగ్ ప్రకటనపై హరీశ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. నీతి ఆయోగ్ రంగును కేసీఆర్ బయటపెట్టారని.. అయితే ఆ సంస్థ రాజకీయ రంగును పులుముకుని విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు

minister harish rao reacts on niti aayog announcement on telangana cm kcr comments
Author
Hyderabad, First Published Aug 7, 2022, 3:10 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికే అదరాబాదరగా నీతి ఆయోగ్ స్పందించిందన్నారు. సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా .. రాజకీయంగా నీతి ఆయోగ్ ప్రకటన విడుదల చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. తద్వారా నీతి ఆయోగ్ తన విలువను తగ్గించుకుందన్నారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రాతిపదికగా వుండాల్సిన సంస్థ అని.. కానీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వంత పాడినట్లుగా వుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. 

నీతి ఆయోగ్ రంగును కేసీఆర్ బయటపెట్టారని.. అయితే ఆ సంస్థ రాజకీయ రంగును పులుముకుని విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు 24 వేల కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రతిపదిస్తే.. 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. దీనిని బట్టి నీతి ఆయోగ్‌కు ఏం విలువ వుందని .. ఆ సంస్థ సిఫారసులకు ఏం విలువ వుందని హరీశ్ రావు ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలను నీతి ఆయోగ్ ప్రశంసించిందని ... తెలంగాణ రాష్ట్రానికి మద్ధతుగా వుండాలని కేంద్రానికి సూచించిందని మంత్రి గుర్తుచేశారు. 

Also Read:అజెండా కోసం ఎన్నో భేటీలు..కేసీఆర్ మాటలు అవాస్తవం, తెలంగాణకు కేటాయింపులివే : నీతి ఆయోగ్

జల్ జీవన్ మిషన్‌లో మా వాటా నిధులు ఇవ్వమంటే ఎలాంటి సమాధానం రాలేదని హరీశ్ రావు విమర్శించారు. నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన తెలిపారు. నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందని హరీశ్ మండిపడ్డారు. జల్ జీవన్ మిషన్ కింద నిధులు కావాలని 2019లోనే అడిగామని మంత్రి గుర్తుచేశారు. నిధులు ఇచ్చినా వాడుకోలేదని తప్పుడు ప్రకటన చేస్తున్నారని.. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాల హక్కులను నీతి ఆయోగ్ కాపాడాలని హరీశ్ డిమాండ్ చేశారు. 

తెలంగాణకు డబ్బులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెబుతుంటే కేంద్రం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలకు నిధుల విడుదలకు సంబంధించి ఫైనాన్స్ కమీషన్ చెబుతున్న దానికి నీతి ఆయోగ్ ప్రకటనకు సత్యదూరం వుందన్నారు. సెస్సులను పెంచి రాష్ట్రాల నోరుకొడుతున్నారని.. చెప్పేదేమో సహకార సమాఖ్య అని, చేసేదేమో రాష్ట్రాల నిధులకు కోత పెట్టడమంటూ ఆయన దుయ్యబట్టారు. బీఆర్‌జీఎంను రద్దు చేయడం వల్ల అప్పట్లో 9 జిల్లాల తెలంగాణకు గ్రాంట్ పోయిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు నిధుల విషయంలో 60-40 నిష్పత్తిలో రాష్ట్రాలు భరించాలని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 

ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన అనే పథకంలో 100 శాతం నిధులను గతంలో కేంద్రమే ఇచ్చేదని.. దానిని ఇప్పుడు 60-40 చేసిందని హరీశ్ చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్‌, ఐసీడీఎస్, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలను 60-40 నిష్పత్తిలో నిధులను భరించాలని చెబుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రం మీద 2,785 కోట్లు అదనపు భారం పడుతుందని హరీశ్ రావు తెలిపారు. 

అంకెల గారడి కాదని.. నిజాలు చెప్పాలంటూ నీతి ఆయోగ్‌కు ఆయన చురకలు వేశారు. నిజా నిజాలేంటో కాగ్ చెప్పందన్న హరీశ్ రావు.. నీతి ఆయోగ్ కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి నిధులు ఇప్పించాల్సిందిపోయి రాజకీయంగా ప్రకటన చేసిందన్నారు. ఎన్నో సమావేశాల్లో తెలంగాణ వాదనను లేవనెత్తామని కానీ.. అది అరణ్య రోదనే అయ్యిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే నీతి ఆయోగ్ సమావేశాన్ని బాయ్ కాట్ చేయాలంటూ కేసీఆర్ ప్రకటన చేశారని హరీశ్ రావు తెలిపారు. న్యాయబద్ధంగా రాష్ట్రాలకు రావాల్సిన 42 శాతం వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios