భూముల కుంభకోణంలో కెసిఆర్ కుటుంబసభ్యుల పాత్ర ఉందని ఆరోపిస్తున్న వారు నిరూపించాలి. బట్ట కాల్చి మీదేస్తామన్నట్లు విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. కెసిఆర్ కుటుంబ సభ్యుల పేర్లు దమ్ముంటే బయట పెట్టాలి. బయట పెట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి.
మియాపూర్ భూముల కుంభకోణంలో వస్తున్న ఆరోపణలపై కెసిఆర్ మేనల్లుడు మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ కుంభకోణంలో కెసిఆర్ కుటుంబసభ్యులు ఎవరున్నారో... దమ్ముంటే పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బయట పెట్టకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్క నేలకు రాయాలన్నారు.
అయినదానికి కానిదానికి విపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులంతా కుంభకోణాల్లో చిక్కుకున్నారని ఆరోపించారు. వారే కాకుండా వారి కుటుంబసభ్యులు కూడా ఇరుక్కుపోయారని చెప్పారు. నిన్నటి వరకు పాలనపై దృష్టి పెట్టామని, ఇకపై ఎవరి కుటుంబసభ్యులు ఏ కుంభకోణంలో ఉన్నారో తేల్చడమే మా పని అని హెచ్చరించారు హరీష్.
ప్రభుత్వం భూముల కుంభకోణం విషయంలో డైనమిక్ గా వ్యవహరించిందన్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే సిఎం ఒక్క క్షణం ఆగకుండా సమీక్ష జరిపి బాధ్యులైన అధికారులపై వేటు వేశారని చెప్పారు. కొందరిని అరెస్టు చేసినం, మరికొందరిని బదిలీ చేసినం, భూములను కాపాడేందుకు సిఎం చేసిన పనిని అభినందించాలన్నారు. విపక్షాలేవీ భూముల కుంభకోణాన్ని బయట పెట్టలేదని హరీష్ రావు అన్నారు. ఆడిట్ నివేదికల ఆధారంగా ప్రభుత్వమే బయట పెట్టిందని చెప్పారు.
హరీష్ రావు విసిరిన సవాల్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా స్వీకరిస్తారో చూడాలి. కెసిఆర్ కుటుంబసభ్యుల పేర్లు బయట పెడతారా ? లేదా అన్నది ఆసక్తికరం.
