కరీంనగర్: ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో తాను మాట్లాడినట్లుగా కొన్ని తప్పుడువార్తలు ప్రచారం జరుగుతున్నాయని... వాటిని ప్రజలెవ్వరూ నమ్మవద్దని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. తమ ప్రభుత్వం ప్రైవేటు భూములను లాక్కుంటుందని అన్నానంటూ తనపై వివిధ మాద్యమాల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని... తన వ్యాఖ్యలను వక్రీకరించి ఈ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 

''నేను అసలు ప్రైవేట్ భూముల ప్రస్తావన తెలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టడాలు చేసిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చామన్నాను. పేదలకు మేలు మాత్రమే చేస్తామని మాత్రమే అన్నాను'' అని మంత్రి వివరించారు. 

read more  హరితహరంతో నే వానలు బాగా కురుస్తున్నాయి మంత్రి గంగుల కమలాకర్

''దసరా వరకు ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చే పంపించాం. ఎవ్వరూ నెగిటివ్ ఆలోచనలు చేయొద్దన్నారు. ఆస్తుల సర్వేకు ప్రజలు సహకరించాలి'' అని మంత్రి గంగుల కోరారు. 

ఇక గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ లోని మహాత్మగాంధీ విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ క్రాంతిలు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే ''బేటి బచావో.. బేటి పడావో'' కార్యక్రమంలో భాగంగా మహిళల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. స్వచ్ సర్వేక్షణ్ లో కరీంనగర్ జిల్లా దేశంలో మూడో స్థానం నిలువడం హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్ శశాంకను మంత్రి గంగుల అభినందించారు.