బిజెపితో టచ్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి... ముమ్మరంగా ప్రయత్నాలు : మహేశ్వర్ రెడ్డి సంచలనం
అధికార బిఆర్ఎస్ పార్టీని వీడి బిజెపిలో చేరేందుకు ఏకంగా ఓ మంత్రే ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.

నిర్మల్ : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అధికారమే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాలతో ముందుకువెళుతున్నాయి. ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లోని కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక మరికొందరు ఉన్నపార్టీలో టికెట్ లభిస్తుందో లేదోనని, పార్టీ బలహీనపడిందనో ఇతర పార్టీల్లో చేరుతుంటారు. ఇలా స్వయంగా ఓ మంత్రే అధికార బిఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యాంటూ జరుగుతున్న ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బిజెపిలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బాంబ్ పేల్చారు. బిజెపి నాయకులతో సంప్రదింపులు జరిపి పార్టీలో చేరడానికి మంత్రి ప్రయత్నించారని అన్నారు. ఇందుకు సబంధించి తనవద్ద ఆధారాలు కూడా వున్నాయని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బిజెపిలో చేరాలని అనుకుంటున్నారట... ఈ విషయాన్ని స్వయంగా మంత్రికి సన్నిహితంగా వుండే నాయకుడే చెప్పినట్లు మహేశ్వర రెడ్డి తెలిపారు. ఇంద్రకరణ్ రెడ్డికి మంచి స్నేహితుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బిజెపిలో వున్నారు... ఆయనే మంత్రి కమలం పార్టీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పారన్నారు.
Read More భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు: నేడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
ఇంద్ర కరణ్ బిజెపిలో చేరడం తనకెలాంటి అభ్యంతరం లేదని... ఆయనకు ముథోల్ నియోజకవర్గం టికెట్ ఇప్పించి పోటీచేయిస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటమిని తప్పించుకోడానికే ఇతర పార్టీలవైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. అయితే ఆయన బిజెపిలో చేరినా నిర్మల్ నుండి పోటీచేసేది తానేనని... కావాలంటూ వేరేచోట అతన్ని పోటీ చేయిస్తామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.