భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు: నేడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి
హైద్రాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు.
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారంనాడు పూజలు నిర్వహించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. దరిమిలా కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బషీర్ బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బషీర్ బాగ్ నుండి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు కిషన్ రెడ్డి. ఇదిలా ఉంటే బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు.భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలకు ముందు అంబర్ పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహనికి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని ఆ పార్టీ ఈ నెల మొదటివారంలో నియమించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినప్పటికీ అధ్యక్ష బాధ్యతలను ఆయన ఇంకా స్వీకరించలేదు. ఇవాళ మంచి ముహుర్తం ఉన్నందున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసింది.ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ సమయంలో మంత్రి పదవి నుండి కిషన్ రెడ్డి తప్పుకోనున్నారు.