పీజీ మెడికల్ విద్యార్థి ప్రీతికి అందుతున్న చికిత్స మీద ఆమె తండ్రి నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని బతికిస్తే చాలంటూ , బిచ్చమెత్తుకునైనా పోషించుకుంటానంటూ వేడుకున్నారు.
హైదరాబాద్ : వరంగల్లో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు అందిస్తున్న చికిత్సకు సంబంధించి ఆమె తండ్రి నరేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రీతిని వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ నిమ్స్ లో తన కూతురికి సరైన వైద్యం అందడం లేదని నరేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు మంచి వైద్యం అందించి కాపాడాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తన కూతురిని బతికిస్తే చాలంటూ రోధించారు.
ఆయన ఏమన్నారంటే.. ‘ఇక్కడ నిమ్స్ లో నా కుమార్తెను ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదు. వరంగల్ ఎంజీఎంలోనే సరైన వైద్యం అందినట్లుగా అనిపిస్తుంది. ఆమె ఆరోగ్యంపై కూడా పూర్తి వాస్తవ పరిస్థితిని మాకు చెప్పడం లేదు. ప్రీతి ఆత్మహత్యాయత్నం, వేధింపుల విషయం తెలిస్తే ఎంజీఎంలో గొడవ అవుతుందని అక్కడి వైద్యులు భయపడ్డారు, అంతేకాదు.. అది బయటికి వస్తే ఆస్పత్రి పరువు పోతుందని అక్కడి సిబ్బంది.. ప్రీతిని హైదరాబాదుకు తరలించారు. అక్కడే సరైన వైద్యం అందినట్లుగా తోస్తోంది.
డీఎంఈ రమేష్ రెడ్డి చెప్పిన మాటలు తప్పు.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం: మెడికో ప్రీతి తండ్రి
నా కుమార్తెపై చాలా రోజులుగా ఆ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆ విషయాన్ని స్థానిక పోలీస్ అధికారులకు ఫోన్లో చాలాసార్లు తెలిపాను. కానీ వారు ఏమీ స్పందించలేదు. నేను ఆర్పీఎఫ్ లో పని చేశాను. ఎంతోమంది ఆత్మహత్యా ప్రయత్నాలు చేసిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చాను. కానీ చివరికి నా కుమార్తెకే ఈ గతి పట్టింది. అది నన్ను తీవ్రంగా కలిచివేస్తోంది. నా కుమార్తె ఆత్మహత్యాయత్నానికి దీనికి కారణమైన కాలేజీ హెచ్ ఓ డి సీనియర్ల మీద తగిన చర్యలు తీసుకుని నా కూతురికి న్యాయం జరిపించాలి. నా కుమార్తెను బతికించే దిశగా మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి. ఆమెకు ఉద్యోగం రాకపోయినా పరవాలేదు. ఆమె బతికితే చాలు. నాలుగు చోట్ల బిచ్చమెత్తుకొని అయినా సరే పోషించుకుంటాను. ప్రభుత్వం మాకు ఈ విషయంలో న్యాయం చేయాలి’ అని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
