రోజూ లాగే ఇవాళ ఉదయం నిద్రలేచి స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : అప్పటివరకూ సంపూర్ణ ఆరోగ్యంతో వున్నవారు కూడా ఒక్కసారిగా గుండెపోటుకు గురయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, రోడ్లు... ఇలా ఎక్కడపడితే అక్కడ గుండెపోటుతో కుప్పకూలి మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి ఘటనలతో ప్రభుత్వమే ఆందోళనకు గురయి తెలంగాణ పోలీసులకు సిపిఆర్ పై శిక్షణ ఇచ్చారంటేనే పరిస్థితి ఎలావుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి విషాదమే చోటుచేసుకుంది. 

ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ ఎండోమెంట్ కాలనీలో నివాసముండే కృష్ణారెడ్డి(46) ఇవాళ ఉదయం వరకు సంపూర్ణ ఆరోగ్యంతో వున్నాడు. రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం కూడా లేవగానే వ్యాయామం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే బ్యాడ్మింటన్(షటిల్) ఆడుతుండగా అతడికి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి మొదలయ్యింది. ఈ నొప్పిని తట్టుకోలేకపోయిన అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఒక్కసారిగా కుప్పకూలిన కృష్ణారెడ్డిని చూసి షటిల్ ఆడుతున్న స్నేహితులు కంగారు పడిపోయారు. స్థానికుల సాయంతో అతడిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీంతో హాస్పిటల్ వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు కృష్ణారెడ్డి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. 

Read More నవజాతశిశువును ఆస్పత్రి బాత్రూం కమోడ్ లో కుక్కి వెళ్లిన తల్లి...

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి కుటుంబసభ్యులను అడిగి గతంలో ఇలాంటి ఆరోగ్య సమస్యలేమైనా వచ్చాయేమోనని ఆరా తీస్తున్నారు. అతడి మృతికి గుండె పోటే కారణమని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు.