ఓ తల్లి అప్పుడే పుట్టిన తన పసికందును బాత్రూం కమోడ్ లో కుక్కి వెళ్లిపోయింది. దీంతో శిశువు మృతి చెందింది. ఆమెకోసం పోలీసులు గాలిస్తున్నారు.  

బాపట్ల : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్లలో ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ మరుగుదొడ్డిలో పసికందుకు జన్మనిచ్చింది. ఆ చిన్నారిని మరుగుదొడ్డిలోని కమోడ్ లో పెట్టి వెళ్లిపోయింది. ఈ ఘటన బాపట్ల రూరల్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

9 నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఒంటరిగా వచ్చింది. డాక్టర్ను సంప్రదించి ఆపరేషన్ చేసి ప్రసవం చేయాలని కోరింది. దీనికి ఆ వైద్యుడు ఒప్పుకోలేదు. ఒంటరిగా వచ్చావు.. కుటుంబ సభ్యులను తీసుకువస్తే ఆపరేషన్ చేస్తానని చెప్పాడు. దీనికి ఏం చేయాలో పాలు పోలేదామెకి. హాస్పిటల్ లోని మరుగుదొడ్డిలోకి వెళ్లేసరికి ఆమెకి పురిటి నొప్పులు వచ్చాయి.

పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయిన వంగవీటి రాధాకృష్ణ!.. అమ్మాయి ఎవరంటే..

 అక్కడే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత అక్కడే మరుగుదొడ్డిలోని కమోడ్ లో ఆశిశువును పెట్టింది. శిశువు మీద గుడ్డ కప్పింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాస్పిటల్ సిబ్బంది మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి మంగళవారం నాడు వెళ్లేసరికి.. అక్కడ పసికందు కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న బాపట్ల పట్టణ ఎస్సై షేక్ మహమ్మద్ రఫీ పరిశీలించారు. అప్పటికే పసికందు మృతి చెంది ఉండడంతో కమోడ్ ను పగలగొట్టి మృతదేహాన్ని బయటకి తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కి పంపించారు. దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.