పోలీసుల వేధింపులతో వరంగల్ జిల్లాకు చెందిన వంశీ అనే యువకుడు గీసుకొండ పీఎస్ ముందు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు

తెలంగాణలో పోలీసుల వేధింపులతో మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన వంశీ అనే యువకుడు గీసుకొండ పీఎస్ ముందు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చోరీ కేసులో తనను పోలీసులు వేధించడం వల్లే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యుడు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం చైన్ దొంగతనం కేసులో ఖదీర్ అనే యువకుడు పోలీస్ కస్టడీలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన సంచలనం సృష్టించింది. చైన్ స్నాచింగ్ కేసులో మ‌హ్మ‌ద్ ఖ‌దీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు తనను దారుణంగా హింసించారని ఆరోపించిన ఆయ‌న హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో ఇందులో భాగ‌మైన‌ కొంతమంది పోలీసులపై దర్యాప్తు జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్న‌తాధికారులు హామీ ఇచ్చారు. 

Also REad: చోరీ చేయలేదన్నా కొట్టారు.. ఆ ముగ్గురు పోలీసులే , చివరి వీడియోలో ఖదీర్ సంచలన వ్యాఖ్యలు

జనవరి 29న హైదరాబాద్ యాకుత్ పురాలో మహ్మద్ ఖదీర్‌ (35) అనే వ్యక్తిని మెదక్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖదీర్‌ మెదక్ టౌన్ నివాసి అయినప్పటికీ యాకుత్ పురాలో బంధువు వద్దకు వెళ్లాడు. జనవరిలో నమోదైన రెండు చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఖ‌దీర్ ను అనుమానించారు. ఈ క్ర‌మంలోనే అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. మెదక్ పోలీసులు తనను 5 రోజుల పాటు కొట్టారనీ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని మహమ్మద్ ఖదీర్ తన చివరి వీడియోలో ఆరోపించారు. మరోవైపు.. ఖదీర్ ఖాన్ (37) మృతి కేసులో మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ డి.మధు, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుళ్లు ప్రశాంత్, పవన్ లను సస్పెండ్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.