మెదక్ జిల్లాలో పోలీసుల కస్టడీలో వుండగా అనుమానాస్పద స్థితిలో మరణించిన ఖదీర్ ఖాన్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఖదీర్‌ చివరి వీడియోలో పలు కీలక అంశాలు ప్రస్తావించిన విషయం వెలుగులోకి వచ్చింది. 

మెదక్ జిల్లాలో పోలీసుల కస్టడీలో మరణించిన ఖదీర్‌ ఖాన్‌ మృతిపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. చైన్ స్నాచింగ్ ఆరోపణలతో ఖదీర్‌పై పోలీసులు చిత్రహింసలు చేసినట్లు అభియోగాలు వున్నాయి. ఆ క్రమంలో ఖదీర్‌ చివరి వీడియోలను అధికారులు పరిశీలించారు. ఖదీర్‌ చివరి వీడియోలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముగ్గురు పోలీసులు తనను 2 గంటల పాటు కొట్టారని వీడియోలో చెప్పాడు. తాను చోరీ చేయలేదని చెప్పినా పోలీసులు కొట్టారని ఖదీర్‌ ఆరోపించాడు. తనతో పాటు తన బావను కూడా కొట్టారని ఖదీర్‌ చెప్పాడు. అయితే చోరీ జరిగిన సమయంలో ఖదీర్‌ ఎక్కడ వున్నాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చోరీ సమయంలో హైదరాబాద్‌లో వున్నానని ఖదీర్‌ చెప్పాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండ్రోజుల క్రితం మృతి చెందాడు ఖదీర్‌. దీంతో ఖదీర్‌ మృతిపై ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. 

ALso REad: మెద‌క్ కస్టడీ మృతి కేసు.. పోలీసులపై సస్పెన్షన్ వేటు

కాగా.. చైన్ స్నాచింగ్ కేసులో మ‌హ్మ‌ద్ ఖ‌దీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు తనను దారుణంగా హింసించారని ఆరోపించిన ఆయ‌న గత గురువారం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో శ‌నివారం నాడు ఇందులో భాగ‌మైన‌ కొంతమంది పోలీసులపై దర్యాప్తు జరిపి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్న‌తాధికారులు హామీ ఇచ్చారు. జనవరి 29న హైదరాబాద్ యాకుత్ పురాలో మహ్మద్ ఖదీర్‌ (35) అనే వ్యక్తిని మెదక్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖదీర్‌ మెదక్ టౌన్ నివాసి అయినప్పటికీ యాకుత్ పురాలో బంధువు వద్దకు వెళ్లాడు. జనవరిలో నమోదైన రెండు చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఖ‌దీర్ ను అనుమానించారు. ఈ క్ర‌మంలోనే అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు.

మెదక్ పోలీసులు తనను 5 రోజుల పాటు కొట్టారనీ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారని మహమ్మద్ ఖదీర్ తన చివరి వీడియోలో ఆరోపించారు. మెదక్ పోలీసులు దారుణంగా హింసించడంతో తీవ్ర గాయాలపాలైన మొహ్మద్ ఖదీర్ హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.