అరుదైన కస్తూరి పిల్లి అవయవాలు స్మగ్లింగ్... ఏం చేస్తాడంటో తెలుసా?
అరుదైన కస్తూరి పిల్లి అవయవాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.
హైదరాబాద్ : అరుదైన అడవి జంతువు అవయవాలను తరలిస్తూ అడ్డంగా బుక్కయ్యాడో వ్యక్తి. ముంబై వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువులు కనిపించడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అరుదైన కస్తూరి పిల్లి అవయవాలు లగేజీ బ్యాగ్ లో లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున సయ్యద్ అక్బర్ పాషా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ముంబై వెళ్ళేందుకు సిద్దమైన అతడి లగేజీని పరిశీలించగా కస్తూరి పిల్లి అవయవాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సిఐఎస్ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా క్షుద్రపూజల కోసం తరలిస్తున్నట్లు తెలిపాడు.
Read More దుబాయ్ వెళ్లే విమానం హైజాక్.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు మెయిల్..
ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుబడిన కస్తూరి పిల్లి అవయవాలతో పాటు సయ్యద్ ను అటవీశాఖ అధికారులు అప్పగించారు.అతడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. కేవలం ఏపీలోకి శేషాచలం అడవులతో హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్ లలో మాత్రమే ఈ కస్తూరి పిల్లి కనిపిస్తుంది. ఇలాంటి అరుదైన వన్యప్రాణి అవయవాలు సయ్యద్ వద్దకు ఎలా వచ్చాయి... వీటిని ఎవరికోసం తరలిస్తున్నాడో తెలుసుకునేందుకు అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
కస్తూరి పిల్లినే పునుగు పిల్లి అని కూడా అంటారు. శేషాచలం అడవుల్లో లభించే ఈ జంతువు ద్వారా వచ్చే తైలం వెంకటేశ్వరస్వామి ఎంతో ఇష్టమైనదిగా భావిస్తారు. దీంతో ఈ తైలాన్ని ఏడుకొండలపై వెలిసిన శ్రీవారి విగ్రహానికి మర్దనం చేస్తారు. అలాగే ఈ పిల్లి అవయవాలు సుంగంధద్రవ్యాల తయారీతో పాటు కొన్నిరకాల ఔషధాల్లోనూ ఉపయోగిస్తుండటంతో వీటికి మంచి గిరాకీ వుంది. దీంతో స్మగ్లర్లు వీటిపై పడ్డారు. అయితే ఈ పునుగు పిల్లుల జాతి అంతరిస్తుండటంతో వీటి సంరక్షణ చర్యలు చేపట్టారు అటవీ శాఖ అధికారులు.