అమరావతి: పరిపూర్ణానంద బ్రాహ్మణుడినని ఒక్కసారి, ఎరుకల వాడిననీ మరోసారి చెప్పుకుంటారనీ, ఏమిటో తెలియదని సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్నారు. కాకినాడలో ఆయనపై బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయని ఆయన అన్నారు.

పోరాటం తనకూ, ఆయనకూ మధ్య కాదని, రెండు సిద్ధాంతాల మధ్య... జై శ్రీరామ్‌, జై భీమ్‌ల మధ్య పోరాటం అని ఆయన అన్నారు. న్యాయ, కార్యనిర్వాహక పాత్రలను పోలీసులే పోషించటం అభ్యంతరకరమని ఆయన అన్నారు. చట్టానికి అందరూ సమానమే గానీ రాజ్యానికి కాదని అర్థమవుతోందని అన్నారు.  వెలి కొత్తేమీ కాదని, వాళ్లు బహిష్కరణ అంటున్నారని, దళితులు దానినే వెలి అంటున్నారని చెప్పారు. 

సమాజంలో భిన్న దృక్కోణాలున్నాయని, ఎవరి దృక్కోణం నుంచి వారు మాట్లాడుతున్నారని అన్నారు. ఒకరు మాట్లాడిన దాన్ని పట్టుకుని ద్వేషపూరితంగా మార్చి ప్రచారం చేయటం సమంజసం కాదని అన్నారు. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదన్న విషయంలో తనను ఎవరూ శాసించలేరని అన్నారు

రాముడిని, హిందూ మతాన్ని రాజకీయాలకు వాడుకోవాలని భావిస్తున్న శక్తులు అనవసరమైన విషయాలని వివాదాస్పదంగా మారుస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌ నుంచి బహిష్కరణకు గురైన తరువాత బుధవారం సాయంత్రం కర్ణాటక నుంచి ఫేస్‌బుక్‌లో లైవ్‌ ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకి మహేష్ కత్తి సమాధానాలు ఇచ్చారు. 

తాను అన్న పదం రాముడిని రాజకీయాలకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్న శక్తులపై మాత్రమేనని అన్నారు. రాజకీయ కుట్ర ఏదో జరుగుతోందని చెప్పారు. అంబేడ్కర్‌ వారసునిగా తనకు రాజ్యాంగం పట్ల నమ్మకం ఉందని అన్నారు. తనపై విధించిన బహిష్కరణను  కోర్టులో సవాల్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
  
తన అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి, వ్యక్తిగా, దళితుడిగా, పౌరుడిగా తన హక్కులను పరిరక్షించుకునేందుకే ప్రయత్నిస్తున్నాని కత్తి తెలిపారు. దళిత కార్డు తీయటమనే పదం సరికాదని ఆయన అన్నారు. తాను దళితుడినేనని, చర్చలో దళితుడిని కాబట్టే చులకన చేసి, టార్గెట్‌ చేశారని మహేష్ కత్తి అన్నారు.