హైదరాబాద్: ఖైరతాబాద్ శానససభ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి దానం నాగేందర్ కు చిక్కులు తప్పేలా లేవు. ఆయనపై ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. అయితే, కాంగ్రెసు అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు కూడా ఆ బెడద తప్పడం లేదు.

టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య కవితా రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెసు, టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థుల కారణంగా చింతల రామచంద్రా రెడ్డి గట్టెక్కే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. 

దాసోజ్ శ్రవణ్ కు కాంగ్రెసు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో రెబెల్ పోటీ చేయడానికి రోహిణ్ రెడ్డి సిద్ధపడుతున్నారు. దానం నాగేందర్ కాంగ్రెసుకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. దాంతో రోహిణ్ రెడ్డి కాంగ్రెసు టికెట్ తనకే దక్కుతుందనే ఉద్దేశంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి దాసోజు శ్రవణ్ ముషీరాబాద్ టికెట్ అడిగారు. ఆ సీటును కాకుండా ఆయనకు ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. 

ఖైరతాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ మన్నె గోవర్ధన్ రెడ్డి అనుచరులు మూడు రోజులుగా తెలంగాణ భవన్ వద్ద ఆందోళన చేస్తున్నారు. గుండెపోటు రావడంతో గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఆస్పత్రిలో చేరి, బుధవారం డిశ్చార్జి అయ్యారు. గత 2014 ఎన్నికల్లో గోవర్ధన్ రెడ్డి చింతల రామచంద్రా రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 

టీఆర్ఎస్ నాయకత్వం తనకు కాకుండా దానం నాగేందర్ కు టికెట్ కేటాయించడంతో మన్నె గోవర్ధన్ రెబెల్ గా తన భార్య కవితా రెడ్డిని పోటీకి దించుతున్నారు. ఇదిలావుంటే, దాసోజ్ శ్రవణ్ కు టీడీపి నుంచి సెగ తగులుతోంది. ఖైరతాబాద్ టికెట్ ను తమ పార్టీకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద ఆందోళనకు దిగారు. 

సంబంధిత వార్తలు

ఖైరతాబాద్ టికెట్ కొట్లాట: టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌కు గుండెపోటు (వీడియో)

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన మన్నె గోవర్దన్ (వీడియో)

తెలంగాణ భవన్ వద్ద లాఠీచార్జ్... మన్నె గోవర్థన్ రెడ్డికి గాయాలు (వీడియో)